రైళ్లలో ఇక సీసీటీవీ కెమెరాలు!ముంబయి మహానగరంలో శుక్రవారం జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కేంద్ర రైల్వేశాఖ భద్రతా ప్రమాణాలపై దృష్టిసారించింది. ఈ మేరకు ముంబయిలో జరిగిన రైల్వే అధికారుల ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే స్టేషన్లలో భద్రతకు అవసరమైన మొత్తాన్ని ఖర్చుచేసే అధికారం ఆయా రైల్వే డివిజన్ల మేనేజర్లకు కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ప్రయాణికులంతా పాదచారుల వంతెనను వినియోగించుకోవడం తప్పనిసరి అని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనను ఓ గుణపాఠంగా తీసుకోవాలని అధికారులకు సూచించారు. భద్రతాపరంగా తీసుకురావాల్సిన సంస్కరణలపై ఈ బోర్డు సమావేశంలో చర్చించారు.
ముంబయిలోని అన్ని సబ్ అర్బన్ రైళ్లలో 15 నెలల్లోగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలని ట్విటర్లో పేర్కొన్నారు. దీంతోపాటుగా దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ దీన్ని విస్తరించాలని సూచించారు. ప్రయాణికులకు అవసరమైన చోట మాత్రమే కాకుండా అన్నిచోట్లా పాదచారుల వంతెనలు ఏర్పాటుచేయాలన్నారు. ముంబయిలోని ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న రైల్వే స్టేషన్లలో అదనంగా ఎస్కలేటర్లను ఏర్పాటుచేయాలని గోయల్ ఆదేశించారు