ఆర్సీఈపీపై సంతకం చేస్తే దేశంలోని రైతులు, దుకాణదారులు, చిన్న, మధ్య తరహా సంస్థ కష్టాలకు అంతూపొంతూ లేకుండా పోతుందని హెచ్చరించారు.
ఆర్థిక మందగమనం, వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగిత, ప్రతిపాదిత ఆర్సీఈపీ తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదేసేందుకు ఈనెల 5 నుంచి 15 వరకూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తలబెట్టిన ఆందోళనల సన్నాహకాలను సమీక్షించేందుకు శనివారంనాడు సోనియాగాంధీ అధ్యక్షతన ఇక్కడ సమావేశం జరిగింది.
ఆర్సీఈపీ సంతకం చేసినట్లయితే అది దేశ ఆర్థిక వ్యవస్థకు పెను శరాఘాతమవుతుందని , వివిధ దేశాల వ్యవసాయ ఉత్పత్తులతో సహా అన్ని ఉత్పత్తులకు భారతదేశం ఒక డంపింగ్ గ్రౌండ్‌గా మారుతుందని సోనియా అన్నారు.
దీంతో అసలే కునారిల్లుతున్న వ్యవసాయరంగం, రైతులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మరింత కుదేలవుతాయని అన్నారు.
‘ఈ దేశ పౌరురాలిగా, బాధ్యత కలిగిన ప్రతిపక్ష సభ్యురాలిగా భారత ఆర్థిక వ్యవస్థ స్తంభన నాకెంతో బాధ కలగిస్తోంది.
ఆర్థిక మందగన పరిస్థితులను చక్కబెట్టేందుకు సమగ్ర తీర్మానాలు చేయడానికి బదులు, ప్రధాని కేవలం పతాక శీర్షికలు, ఈవెంట్లకు పరిమితమవుతున్నారు’ అంటూ సోనియాగాంధీ తప్పుపట్టారు.