విశాఖపట్నం పోర్ట్ అథారిటీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (వీపీఏ) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 12, 2026న సాగర్మాల కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి ఎస్.ఎస్. శోభిక, ఐఏఎస్, వైస్ చైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ లిమిటెడ్ హాజరయ్యారు.
గౌరవ అతిథులుగా శ్రీమతి కె. రోష్ని అపరంజి, ఐఏఎస్, డిప్యూటీ చైర్పర్సన్, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ మరియు శ్రీ టి. అరుణ్ ప్రసాద్, ఐఈఎస్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, వీపీఏ & డీసీఐ పాల్గొన్నారు.
ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీమతి దివ్య హరేరీంద్ర ప్రసాద్ (B.Sc., MBA, LL.B), అడ్వకేట్ మరియు శ్రీమతి లక్ష్మీ ప్రసాద్ (M.Sc., M.Phil) హాజరయ్యారు.
వీపీఏ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మరియు మహిళా విభాగం కన్వీనర్ డా. ఉషా దేవి, అలాగే విభాగాధిపతులు, మహిళా అధికారులు మరియు మహిళా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన డా. ఎం. అంగముత్తు, ఐఏఎస్, చైర్పర్సన్ పోర్ట్ మహిళా విభాగం చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించారు. పోర్ట్ అభివృద్ధిలో మహిళా ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొంటూ, తమ కృషితో సంస్థకు మరిన్ని విజయాలు తీసుకురావాలని ప్రోత్సహించారు.
అలాగే శ్రీమతి కె. రోష్ని అపరంజి, ఐఏఎస్, డిప్యూటీ చైర్పర్సన్ మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక స్వావలంబన ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళలు సంపాదించడమే కాకుండా తమ ఆదాయాన్ని పొదుపు చేసి, సరైన విధంగా పెట్టుబడి పెట్టే అలవాటు కూడా పెంపొందించుకోవాలని సూచించారు. కుటుంబ బాధ్యతలు పూర్తిగా మహిళలపైనే ఉండటం వారి వృత్తి పురోగతిపై ప్రభావం చూపవచ్చని, అందువల్ల కుటుంబంలో బాధ్యతలను అందరూ పంచుకోవడం అవసరమని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మహిళలు అన్ని రంగాల్లో చేస్తున్న సేవలను కొనియాడుతూ, ఉద్యోగ ప్రదేశంలో మరియు ఇంటి వద్ద. సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్న మహిళలను అభినందించారు.
ఈ వేడుకల సందర్భంగా విశాఖపట్నం పోర్ట్ మహిళా విభాగం ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. త్వరలో పదవీ విరమణ పొందనున్న సీనియర్ మహిళా ఉద్యోగులను డిప్యూటీ చైర్పర్సన్ మరియు ఇతర అతిథులు సన్మానించారు. మహిళా విభాగం నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు కూడా ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమం ద్వారా మహిళా ఉద్యోగుల కృషిని గుర్తించి, వారిని ప్రోత్సహించాలన్న వీపీఏ సంకల్పం మరొక్కసారి స్పష్టమైంది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు పోర్ట్ కార్యదర్శి శ్రీ ఎం. శంకర్ బాబు, మరియు వారి బృందాన్ని డిప్యూటీ చైర్పర్సన్ ప్రత్యేకంగా అభినందించారు.













