ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీఎం జగన్ మోహన్ రెడ్డి హిట్ లిస్ట్‌లో చేరారని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో 147 దేశాలకు వ్యాపించిన కరోనా మీద WHO, భారత ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతుంటే.. జగన్ మోహన్ రెడ్డికి ఎన్నికలు ముఖ్యమా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ మీద సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ‘కరోనా వైరస్ మీద జగన్ ఒక సమీక్ష పెట్టలేదు. ఓ ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇన్నాళ్లూ వీడియోగేమ్స్ ఆడుకున్నారు. కరోనాతో 60 ఏళ్ల పైబడిన వారే చనిపోతారని జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనం. వెంటనే జగన్ తాను మాట్లాడిన మాటలు విత్ డ్రా చేసుకోవాలి. మీకు మనుషుల ప్రాణాల కంటే ఎన్నికలు ముఖ్యమా? అధికార దాహం కాకపోతే మరేంటి?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ నేతలు, అభ్యర్థుల మీద దాడులు చేశారని, పోలీసులే ఏకంగా బెదిరించారంటూ కొన్ని వీడియోలను ప్రదర్శించారు. మహిళల మీద కూడా దాడి చేసి, తిరిగి టీడీపీ నేతల మీదే కేసులు పెట్టారన్నారు. అందరినీ బెదిరించి ఎన్నికలు జరుపుతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు వేస్తారని ధీమా ఉంటే వైసీపీ ఎందుకు బెదిరింపులు, దాడులకు దిగిందని చంద్రబాబు నిలదీశారు.
పొరుగున్న ఉన్న తెలంగాణలో సీఎం కేసీఆర్ రెండు రోజుల్లోనే మాట మార్చి మొత్తం విద్యాసంస్థలను బంద్ చేశారని, దేశంలో ఆరు రాష్ట్రాల్లో మొత్తం షట్ డౌన్ చేశాయని చంద్రబాబు అన్నారు. కేవలం 60 సంవత్సరాలు దాటిన వారికే కరోనా వస్తుందంటున్న జగన్… కెనడా ప్రధాని భార్యకు వచ్చిన విషయాన్ని గమనించాలని సూచించారు. జగన్ మాట్లాడితే 151 సీట్లు వచ్చాయని అంటున్నారని, లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో 7 సీట్లు గెలిచిన బీజేపీ… కేవలం 8 నెలల తర్వాత వచ్చిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. సామాజికవర్గం పేరుతో పేరుపెట్టి జగన్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చంద్రబాబు అన్నారు. అన్నీ జగన్‌కు చెప్పి చేయాలా? అని ప్రశ్నించారు. మొన్న శాసనమండలిలో బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపిస్తే కౌన్సిల్‌ను రద్దు చేస్తూ తీర్మానం చేశారని, ఇప్పుడు ఏకంగా ఎన్నికల కమిషన్‌ను కూడా బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

















