Significance of Talupulamma Talli Temple At Lova Story in East Godavari,Vizag Vision…తలుపులమ్మ లోవ : తూర్పు గోదావరి జిల్లా, తుని మండలానికి చెందిన గ్రామము. తునికి సమీపంలో ఉన్న లోవకొత్తూరు దగ్గర ఉంది. ఇది పర్యాటక ప్రాంతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృక్షశాస్త్రం చదివే విద్యార్థులు తరచు ఇక్కడకి విహారయాత్రకి వెళుతూ ఉంటారు. పూర్వం కాలినడకన వెళ్ళేవారు..అమ్మవారు ‘తలుపులమ్మ’ గా ఆవిర్భవించిన క్షేత్రమే ‘లోవ’. అత్యంత ప్రాచీనమైన ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఈ ప్రదేశం తలుపులమ్మ లోవగా ప్రసిద్ధి చెందింది.ఒకప్పుడు దట్టమైన అరణ్యంగా చెప్పబడుతోన్న ఈ ప్రాంతంలో ఎటుచూసినా కొండలు దర్శనమిస్తుంటాయి. ఈ కొండలలో ఒకదానిని ‘ధారకొండ’ గానూ మరొక దానిని ‘తీగకొండ’ గా స్థానికులు పిలుస్తుంటారు. ఈ రెండు కొండల మధ్య ‘తలుపులమ్మ’ అమ్మవారు దర్శనమిస్తూ వుంటుంది. తలపులను నెరవేర్చు అమ్మవారు కనుక తలుపులమ్మగా ప్రసిద్ధి చెందినట్టు స్థల పురాణం చెబుతోంది.కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షి, సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా నీటిజాడ కనిపించలేదు. దాంతో ఆయన జగన్మాతను ప్రార్థించగా, కొండపైన పాతాళగంగ పొంగింది. సంధ్యా వందనం పూర్తి చేసుకున్న అగస్త్యుడు, ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని అమ్మవారిని కోరడంతో, ఆయన అభ్యర్ధనమేరకు అమ్మవారు ఇక్కడి కొండగుహలో కొలువుదీరింది.కాలక్రమంలో అమ్మవారు భక్తుల కోరికలను నెరవేరుస్తూ తలుపులమ్మగా పూజాభిషేకాలు అందుకుంటోంది. ఇక్కడి అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన ఇక్కడి అమ్మవారిని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. వెలమకొత్తూరు గ్రామం దగ్గరలో ఉంటుంది.

















