ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ లేఖ రాశారు. రాజ్యసభలో ఇప్పటికే ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలోనూ ఆమోదం పొందేలా చూడాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తుందని స్పష్టంచేశారు.
2010 మార్చిలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. అప్పుడు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే అప్పటినుంచి కొన్ని కారణాల వల్ల లోక్‌సభలో ఇంకా ఆమోదం పొందలేదు. ఇదే విషయాన్ని సోనియా ప్రధానికి రాసిన లేఖలో ప్రస్తావించారు. అయితే ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీయే ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఈ బిల్లును వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.
అంతేగాక పంచాయతీలు, నగరపాలక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు ప్రయత్నించిన తొలి నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీయేనని ఈ సందర్భంగా ఆమె లేఖలో గుర్తుచేశారు.