అనంతపురం: టిడిపి నేత, అనంతపురం ఎంపీ జెసి దివాకర్ రెడ్డి గురువారం సంచలన ప్రకటన చేశారు. తాను తన లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పారు.
ఎన్నికలకు మరో రెండేళ్లు ఉంది. ఇలాంటి సమయంలో రాజీనామా ప్రకటన కలకలం రేపింది. తనకు అధిష్టానంతో ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు.
కానీ, జెసి మాటల్లోనే అధిష్టానంపై అసంతృప్తి కనిపిస్తోందని అంటున్నారు. తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని, అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు. స్పీకర్ విదేశీ పర్యటనలో ఉండటంతో రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్తానని చెప్పారు. తాను టిడిపిలోనే కొనసాగుతానన్నారు. అధిష్టానంతో ఇబ్బంది లేదన్నారు.
రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడే సమర్థుడని, మరోసారి ఆయనే సీఎం అవుతారని జెసి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అనంతపురంలో పారిశుద్ధ్య సమస్యను కూడా పరిష్కరించలేకపోవడం, రోడ్డు వెడల్పు చేయలేకపోవడం, చాగల్లు రిజర్వాయర్‌కు నీళ్లు తీసుకు రాలేకపోవడం తదితర అంశాల్లో బాధ్యత కల్గిన ఎంపీగా తాను విఫలమయ్యానన్నారు. అనంతపురం అభివృద్ధికి కొన్ని శక్తులు అడ్డుతగిలాయన్నారు. అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు.
జెసి రాజీనామా చేస్తానని చెప్పడంతో ఎన్నో అనుమానాలు, ఊహాగానాలు చెలరేగాయి. చంద్రబాబుపై అసంతృప్తితో ఉన్నారా? స్థానిక టిడిపి నేతల నుంచి మద్దతు లభించడం లేదా? లేక కొడుకు రాజకీయ రంగ ప్రవేశం కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? అనే చర్చ జరిగింది.
ఓ వైపు ఈ చర్చ జరుగుతుండగానే జేసీ దివాకర్ రెడ్డి చల్లబడినట్లుగా తెలుస్తోంది. ఆయన చెప్పినట్లుగానే నీటి గురించే అసంతృప్తితో ఉన్నారు. ఓ విధంగా చంద్రబాబు ప్రభుత్వంపై అసంతృప్తిగా భావించవచ్చునని అంటున్నారు.
చాగల్లు రిజర్వాయర్‌కు నీరు విడుదల కావడం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నానని జేసీ ప్రకటించగానే టిడిపిలో కలకలం రేగింది. విషయం తెలిసి వెంటనే చంద్రబాబు స్పందించారు. దీంతో జేసీ మెత్తబడ్డారు.
చంద్రబాబుతో మంత్రి దేవినేని ఉమ, అధికారులు సమావేశమయ్యారు. ఈ అంశంపై చర్చించారు. చాగల్లు రిజర్వాయర్‌కు 200 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని మంత్రి దేవినేని ఆదేశించారు. నీటిని విడుదల చేసి, తుంగభద్ర ఎస్ఈ.. జేసీ దివాకర్ రెడ్డికి ఫోన్ చేశారు. ఆ వెంటనే జేసీతో దేవినేని మాట్లాడారు.
జీడిపల్లి రిజర్వాయర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం కోసం ఆగామని, చాగల్లు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేశామని జేసీతో దేవినేని చెప్పారు. దీంతో దేవినేని మెత్తబడ్డారని తెలుస్తోంది.