“కంటి వెలుగు” జిల్లాలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు in Visakhapatnam, Vizagvision…
*విద్యార్థుల “కంటి వెలుగు” కు 850 టీమ్ లు*
*డిఎం అండ్ హెచ్ఓ డా.ఎస్ తిరుపతిరావు*
విశాఖపట్నం, అక్టోబర్ 9: గురువారం నుండి జిల్లాలో ఉన్న పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఎస్. తిరుపతి రావు తెలిపారు. బుధవారం తమ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 10 ప్రపంచ అంధత్వ నివారణ దినం నుండి ప్రారంభమయ్యే వైయస్సార్ కంటి వెలుగు లో భాగంగా మొదటి విడతగా 5 నుండి 10వ తరగతి విద్యార్థులకు పాఠశాలల్లోనే కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. 10వ తేదీన గాజువాక జెడ్ పి ఉన్నత పాఠశాల లో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు.10 నుండి 16వ తేదీ వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని 5,268 ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 6 లక్షల 16 వేల 166 మంది కు విద్యార్థులకు పరీక్షలు జరిపుతామని వెల్లడించారు. లోపాలను గుర్తించి, అవసరమైన వారికి ఉచితంగా కళ్ళజోళ్ళు, కంటి సమస్యలకు శస్త్రచికిత్సలు, వైద్య సహాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు 117 ఆసుపత్రులు, ప్రాథమిక వైద్య కేంద్రాల నుండి 146 వైద్య అధికారులు, 850 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వైద్య సిబ్బంది తోపాటు ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఇచ్చినట్లు తెలియజేశారు. ప్రజలందరూ దీని పట్ల అవగాహన కలిగి వారి పిల్లలకు పరీక్ష లు చేయించాలని ఆయన కోరారు.
















