గాజువాక శ్రీకన్య సినీ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం
ఆథునిక పరికరాలతో కూడిన రెండు థియేటర్లు దగ్ధం
మంటల్లో కాలిబూడిదైన శ్రీకన్య, హెవెన్: రూ.3 కోట్ల నష్టం
సకాలంలో స్పందించి సమన్వయంతో పనిచేసిన సిబ్బంది, మహా విశాఖ నగర పరిధిలోని పారిశ్రామికవాడ గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గాజువాక మెయిన్ రోడ్‌లోని కన్య, శ్రీకన్య థియేటర్ కంప్లెక్స్‌లో తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో రెండు థియేటర్లు పూర్తి గద్ధమయ్యాయి. ‘శ్రీకన్య సినిమాస్’ సముదాయంలోని పై అంతస్తుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి రెప్పపాటులో పూర్తిగా వ్యాపించాయని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. గాజువాక ప్రధాన రహదారిలో ఒకే భవనంలో కింది, పై అంతస్తుల్లో కన్య, శ్రీకన్య, హెవెన్స్ థియేటర్లు ఉన్నాయి. సోమవారం తెల్లవారుజామున థియేటర్ల నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన స్వీపర్ చిట్టెమ్మ మేనేజర్‌కు సమాచారం అందించింది. ఆయన అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో అక్కడికి వచ్చేసరికే థియేటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. 8 ఫైరింజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు ప్రయత్నించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో రెండు థియేటర్లలోని తెరలు, సీట్లు, ప్రొజెక్టర్లు, ఏసీ యూనిట్లు పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.3 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు థియేటర్ల మేనేజర్ రమణబాబు తెలిపారు. విద్యుదాఘాతంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ప్రమాదంపై పూర్తిస్థాయి సమగ్ర విచారణ జరిపించనున్నట్లు డీసీపీ-2 ఫకీరప్ప తెలిపారు. కన్య, శ్రీకన్య థియేటర్ సముదాయంలోని రెండు స్క్రీన్లు (శ్రీకన్య, హెవెన్స్) పూర్తిగా కాలిపోయాయి. ఉదయం కావడంతో థియేటర్లో ప్రేక్షకులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సుమారు రెండు గంటల పాటు కష్టపడి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దట్టమైన పొగలతో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు విస్తరిస్తాయేమోన్న భయంతో స్థానికులు ఆందోళన చెందారు. అయితే, సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేసినప్పటికీ జరగాల్సిన నష్టం అప్పగికే జరిగిపోయింది. మొత్తానికి సకాలంలో చేరుకున్న ఫైర్ సిబ్బంది సుమారు 2 గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తేవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. నష్ట పెద్దమొత్తంలో ఉంటుందని, అయితే, బీమా సదుపాయం ఉండడం వల్ల యాజమాన్యానికి కాస్త ఊరటకలిగినప్పటికీ తాత్కాలికంగా థియేటర్లను పునరుద్దరించే వరకు నష్టం తప్పదు. థియేటర్ సముదాయంలో ఉన్న ఫైర్ అలారం సిస్టం పనిచేయకపోవడం వల్ల కూడా నష్టం భారీగా జరిగినట్లు పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు. ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణమని ఫైర్ సిబ్బంది ప్రాధమికంగా గుర్తించారు. ఆటలు ప్రదర్శన సమయంలో ఇదే ప్రమాదం జరిగి ఉంటే ప్రాణ నష్టం వందల్లో ఉండేదని అధికారులు చెబుతున్నారు. ఉపహార్ థియేటర్ ప్రమాదం కన్నా ఈ ప్రమాదం అతిపెద్దదై ఉండేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలావుండగా, ప్రమాదంపై పలు సందేహాలు, ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రచారంలో వాస్తవం ఎంతో తెలియనప్పటికీ బీమా పరిహారం కోసమో లేక ప్రస్తుతం ఉన్న కాంప్లెక్స్ స్థానంలో మల్టీఫ్లెక్స్ నిర్మించాలనే ఆలోచనో ఈ ప్రమదం వెనుక ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదిఏమైనా ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అటు పోలీస్, ఫైర్, ఇటు రెవెన్యూ అధికారులు స్పందించిన తీరుకు ప్రశంసల వర్షం కురుస్తోంది. మంటలు ఎగసిపడుతున్న ప్రాంతంలో అగ్నిమాపక బృందాలు సాహసోపేతమైన సేవలు అందించాయి. మరోవైపు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్-2 ఫకీరప్ప నేరుగా ఘటనా స్థలానికి చేరుకుని తమ బృందాలను అప్రమత్తం చేశారు. సిబ్బందితో దగ్గరుండి సహాయక కార్యక్రమాలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు