తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం తన ఎన్నికల ప్రచారం ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రారంభించబోతున్నారు. తెలంగాణ ఉద్యమంలో నియోజకవర్గంతో ఆత్మీయ అనుబంధం ఉన్న కోదండరాం తన ఎన్నికల ప్రచారం ఇక్కడి నుంచే చేపట్టాలని నిర్ణయించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు అడిక్‌మెట్‌లోని వీరాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నియోజకవర్గం టీజేఎస్ ఇన్చార్జి ఎం.నర్సయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని ప్రారంభించనున్నారు.
రాంనగర్ చౌరస్తాలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించనున్నారు. ప్రచారంలో భాగంగా అజర్గల్లీ, సెయింట్ ఫాయిస్ స్కూల్ వీధి, మోహన్‌నగర్, శాస్త్రినగర్, జెమినికాలనీ, హరినగర్, కృష్ణనగర్‌లో పాదయాత్ర నిర్వహిస్తారు. అనంతరం ఎస్ఆర్టీ కాలనీలో జరిగే సమావేశంలో మాట్లాడతారు. కోదండరాం ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు నియోజకవర్గం ఇన్చార్జి ఎం.నర్సయ్య తెలిపారు. తొలి కార్యక్రమానికి పెద్దఎత్తున జనసమీకరణ జరిగేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.