రాజకీయ పార్టీని స్థాపించిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత…
ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ అవతరించింది. విశాఖ జిల్లాకు చెందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత జనజాగృతి పార్టీని స్థాపించారు. విజయవాడలో ప్రెస్మీట్ నిర్వహించిన ఆమె ఈ ప్రకటన చేశారు. మార్పు కోసం ముందడుగు అనేది పార్టీ నినాదమని ఆమె చెప్పారు. పార్టీ జెండాను కూడా ఆమె విడుదల చేశారు. నీలం రంగు, తెలుపు రంగుతో కూడిన జెండాపై గొడుగు చిహ్నాన్ని ముద్రించారు. ఈ సందర్భంగా ఆమె ప్రతిపక్ష నేత జగన్పై విమర్శలు గుప్పించారు. జగన్ అసెంబ్లీకి వెళ్లరని, సమస్యలు ప్రస్తావించరని విమర్శించారు. తాను డిప్యూటీ కలెక్టర్గా పనిచేశానని, నాలుగున్నరేళ్లు ఎంపీగా ఉన్నానని, విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహతో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. గిరిజన ప్రాంత సమస్యల్ని పార్లమెంట్లో ప్రస్తావించానని చెప్పారు. రాజకీయ పార్టీలున్నది ప్రజల కోసమేనని ఆమె తెలిపారు. 2014లో వైసీపీ తరపున అరకు ఎంపీగా పోటీ చేసి గెలిచిన కొత్తపల్లి గీత కొన్నాళ్లుగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఒక దశలో టీడీపీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ అనూహ్యంగా ఆమె రాజకీయ పార్టీని స్థాపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.