Have you ever seen auto picking up Human beings?Munchangiputti,Vizag Vision..మీరు ఎప్పుడూ ఆటో మనుషులను మోసుకెళ్ళడం చూసుంటారు కాని మనుషులు ఆటోను మోసుకెళ్ళడం ఎక్కడైనా చూసారా. ఇదేదో మెకానిక్ షాపులోనో లేదో ఆటో గ్యారేజీలోనో కాదు రొడ్డుపైనే. అవును మీరు వింటున్నది నిజమే. నమ్మలేక పోతున్నారా. అయితే ఒక్కసారి మనం విశాఖ ఏజెన్సీ కు వెళ్లాల్సిందే.
ఇదిగో ఇక్కడ చూసారా పది మంది ప్రయాణీకులను మోయాల్సిన ఆటోను పది మంది గిరిజనులు మోస్తున్నారు. ఆటో రిపేరో లేకా ప్రమాదానికి గురై లోయలో పడిన ఆటోను బయటకు తీస్తున్నారనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇటీవల ఏజెన్సీ లో కురిసిన భారీ వర్షాలకు కాజ్ వే కూలిపోవడంతో దానిని దాటించడానికి గిరిజనులు పడుతున్న కష్టాలు. ముప్పై మీటర్ల కాజ్ వే ను మనం దాటిస్తే అది మనల్ని ముప్ఫై కిలోమీటర్లు తీసుకెళ్తుందనే ఉద్దేశంతో గిరిజనులు ఇలా ఆటోను ప్రాణాలకు తెగించి కాజ్ వే ను దాటిస్తున్నారు.
విశాఖ జిల్లా
ముంచంగిపుట్టు మండలం లక్ష్మిపురం పంచాయతీ పరిధి లోని ముత్తగుమి రోడ్డులో జరిగిన ఈ విచిత్రం అటు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థను ( ఐటిడిఏ ), ఇటు ప్రభుత్వాన్ని కి సవాల్ విసురుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే విశాఖ ఏజెన్సీ లో ఇటీవల కురిసిన వర్షాలకు ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ ముత్తగుమి రోడ్డులోని కాజ్వే పూర్తిగా కొట్టుకుపోయింది. దీనితో ఒడిశా సరిహద్దులోని సుమారు 80 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీనితో మైదాన ప్రాంతాలకు వెళ్ళాలంటే గిరిజనులు ప్రాణాలకు తెగించి రాకపోకలు సాగించాల్సి వస్తుంది. ఎంతో కష్టపడి తమ వాహనాలను ఒడ్డుకు చేరుస్తున్నారు. రెండు రోజులుగా రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లక్ష్మిపురం పంచాయతీతో సరిహద్దులో ఉన్న ఒడిశాలోని 80 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అత్యవసర ప్రయాణానికి గిరిజనులంతా నరకయాతన పడుతున్నారు. గెడ్డలో నీటి ఉధృతి అధికంగా ఉండడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. బైక్లు, ఆటోలను అతికష్టంపై గెడ్డను దాటిస్తున్నారు. ముప్పై మీటర్ల కాజ్ వేను ఆటోను దాటిస్తే ముప్పై కిలోమీటర్లు సాఫీగా ప్రయాణం చేసుకోవచ్చనే ఉద్దేశంతో ప్రాణాలను పనంగా పెట్టి ఆటోలను తలపై మోసుకుని వెళ్తున్నారు.