TDP MP’s are Inmates Initiators or Kitty Parties Let’s do it in Delhi Demand YSRCP,Visakhapatnam,Vizagvision..
రాష్ట్రం సిగ్గుపడేలా ఢిల్లీలో జోన్ లేదు..గీను లేదు అని వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం ఎంపీలే ఇప్పడు విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ కోసం దీక్షలు చేపట్టడం హాస్యాస్పదమని వైసీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అద్యక్షులు గుడివాడ అమర్నాద్ అన్నారు. మద్దిలపాలెంలో గల వైసీపీ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వేజోన్ కోసం దీక్షల పేరిట ఎంపీలు, వారి కుటుంబ సభ్యులు ప్రజాధనంతో భారీ సెట్టింగ్‌లు వేసి దీక్ష చేయడం చూస్తుంటే అది ఓ కిట్టీ పార్టీలా ఉందని ఎద్దేవాచేశారు. తెలుగుదేశం ఎంపీలకు ఢిల్లీ వీధుల్లో తిరిగే ధైర్ఘ్యం లేక, విశాఖ గల్లీల్లో తిరుగుతూ దీక్షలు పేరిట నాటకాలాడుతున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాల్సిన బాధ్యతలో ఉన్న ఎంపీలు దానిని విస్మరించారని, పైగా రైల్వేజోన్‌పై హాస్యాస్పదంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అసలు ఈ ఎంపీలకు రైల్వేజోన్ గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. తెలుగుదేశం ఎంపీలకు ధైర్ఘ్యముంటే ఢిల్లీలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ ఇంటిముందు ధర్నాలు చేపట్టాలని సవాల్ విసిరారు. అంతేతప్ప విశాఖ రైల్వే స్టేషన్ ముందు భారీ సెట్టింగ్ లు వేసి ప్రజలను, ప్రయాణీకులను ఇబ్బంది పెడతారా అని ప్రశ్నించారు. గతంలో తాము రైల్వేజోన్ కోసం ఆమరణ నిరాహార దీక్షను చేపట్టి, తమ పోరాటానికి అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చినపుడు అవహేళన చేసిన నాయకులే నేడు దీక్ష చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. నేతలకు నాలుగు సంవత్సరాల తరువాత జోన్ గుర్తుకు వచ్చి ఇప్పడు దొంగ దీక్షలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. కడప స్టీల్‌ప్లాంట్ కోసం దొంగ దీక్ష చేపట్టినట్లే ఇక్కడ కూడా రైల్వేజోన్ కోసం మరలా టీడీపీ నేతలు దొంగ దీక్షలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయని చెప్పి దొంగ దీక్షలు చేస్తూ ప్రజల మభ్యపెట్టాలని టీడీపీ ప్రయత్నిస్తోందన్నారు. అయితే ప్రజలు ఇవేవి నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెబుతారన్నారు. ఇటీవలే ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనకు విచ్చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీపైన, జగన్‌పైన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. గత రెండు వందల రోజులుగా జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం చూసి ఓర్వలేకే ఆరోపణలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో స్థిరత్వం లేని వ్యక్తి పవన్ కల్యాణ్ అని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో షుగర్ ఫ్యాక్టరీల అభివృద్ధికి ఎంతో కృషిచేశారన్నారు. అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న అవినీతి, రాక్షస పాలనను ప్రజలు ఇప్పటికే వ్యతిరేకిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెబుతారని అన్నారు. వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రస్తుత్తం తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిసి మంగళవారం ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొనటం జరిగిందన్నారు.