నేటి నుంచి అమర్నాథ్ యాత్ర
పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్ల నడుమ వార్షిక అమర్నాథ్ యాత్ర జమ్ములోని భాగవతి నగర్ నుంచి ప్రారంభం కానున్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రెండు లక్షలమంది, అమర్నాథ్ యాత్రకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి తీర్థయాత్రికులతో పాటు సాధువులు కూడా అమర్నాథ్ యాత్రకోసం జమ్ముకు రావడం మొదలైంది. బుధవారం ఉదయమే పలు వాహనాల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తొలి బ్యాచ్ యాత్రికులు బల్టాల్, పహల్గామ్ బేస్ క్యాంపులకు బయలుదేరనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అనంతనాగ్ జిల్లాలో ఉన్న ఈ రెండు బేస్ క్యాంపులకు యాత్రికులు బుధవారం సాయంత్రానికి చేరుకుంటారు. మరునాడు 3,880 అడుగుల ఎత్తులో ఉన్న గుహాలయానికి, యాత్రికులు కాలినడకన యాత్ర కొనసాగిస్తారు.
ఆగస్టు 26న రక్షాబంధన్ పర్వదినం రోజున అమర్నాథ్ యాత్ర ముగుస్తుంది. యాత్ర సజావుగా సాగడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు జమ్ము ఐజీపీ ఎస్డీ సింగ్ జమ్వాల్ తెలిపారు. అమర్నాథ్కు వెళ్లే వాహనాలకు మొదటిసారి రేడీయో ఫ్రీక్వెన్సీ ట్యాగ్లను అమరుస్తున్నారు. సీఆర్పీఎఫ్ మోటారు సైకిల్ స్కాడ్లు అప్రమత్తంగా ఉంటాయి. ఈ ఏడాది యాత్రను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం 40 వేలమంది భద్రతా సిబ్బందిని రంగంలోకి దింపింది. గత ఏడాది మొత్తం 2.60 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ గుహను సందర్శించారు.
చిత్రాలు…హెల్మెట్లకు అమర్చిన కెమెరాలతో బందోబస్తుకు సిద్ధమైన భద్రతా జవాన్లు
*అమర్నాథ్ యాత్ర సందర్భంగా జమ్ము-శ్రీనగర్ హైవేపై జవాన్ల బందోబస్తు