20న సీఎం చంద్రబాబు నిరాహార దీక్ష,Vizagvision….రాష్ట్ర సమస్యలు, కేంద్ర వైఖరికి నిరసనగా నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధనలో రాజీపడబోమని స్పష్టంచేశారు. విభజన హామీల సాధన కోసం ఈ నెల 20న ఒక్క రోజు నిరాహార దీక్ష చేస్తానని వెల్లడించారు. ‘నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో ఈ నెల 30న తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అంబేడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా గుంటూరు జిల్లాలోని తుల్లూరు మండలం శాఖమూరులో రూ.100 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మించబోయే అంబేడ్కర్ స్మృతివనం ఆకృతిని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆయన మాట్లాడారు.
హేతుబద్ధత లేని విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును, ప్రతిపక్షాల వ్యవహార శైలిని ఈ సందర్భంగా సీఎం ఎండగట్టారు. వచ్చే ఎన్నికల్లో 25 మంది ఎంపీలను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేపు దిల్లీని శాసించబోయేది తెదేపానే అన్నారు. తాను పోరాడుతున్నది కేంద్రంపైన, నరేంద్ర మోదీపైన అన్నారు. ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పామని, భవిష్యత్తులోనూ చక్రం తిప్పుతామని అన్నారు. తాను ఈ నెలలోనే పుట్టానని, ఏప్రిల్ 20న ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేయాలనుకుంటున్నట్టు వెల్లడించారు. ప్రధాని మోదీ కూడా మొన్న పార్లమెంట్ జరగలేదని నిరాహార దీక్ష చేశారన్నారు. పార్లమెంట్ జరగపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. నిరాహార దీక్షతో కేంద్రానికి తన నిరసన తెలియజేస్తానన్నారు. అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్ల కంటే ముందు ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోదీ ఏడుకొండల వెంకన్న సాక్షిగా తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. దాన్ని అమలుచేసే పరిస్థితి లేకపోవడం దారుణమన్నారు. ఆయన ఇచ్చిన హామీలను దేశానికి గుర్తుచేయాలన్నారు. హక్కుల కోసం పోరాడేందుకే ఈ నెల 30న పెద్ద మహాసభ పెడుతున్నామన్నారు. ప్రతిఒక్క ఇంట్లో దీనిపై చర్చ జరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. కానీ ప్రతిపక్ష నేతలు మాత్రం లాలూచీ రాజకీయాలు చేస్తున్నారన్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు.