రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. పెట్టుబడులు వస్తున్నాయి కదాని ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకని బీజేపీ నేతలు ప్రశ్నించడం సరికాదన్నారు. జగన్‌పై కేసులు ఎంత వాస్తవమో.. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం అంతే నిజమని చంద్రబాబు అన్నారు. జీవితంలో ఏ స్థాయికి చేరుకున్నా ఎక్కడి నుంచి వచ్చామన్నది మాత్రం మరిచిపోకూడదని నేతలకు చంద్రబాబు సూచించారు. ప్రజల జీవన ప్రమాణాలు బాగుండి వారు ఆనందంగా గడిపే వాతావరణం కల్పించే ప్రభుత్వాలే మనుగడ సాధిస్తాయన్నారు. టీడీపీకి ముందు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో అవకాశాలు వచ్చాయని..
అయితే వారు కాసుల కోసం కక్కుర్తి పడి వాటిని దుర్వినియోగం చేసుకున్నారన్నారు. 2004 నుంచి పదేళ్లు కూడా తామే అధికారంలో ఉండి ఉంటే రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉండేదన్నారు. కట్టుబట్టలతో పాలన ప్రారంభించినా మూడేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామన్నారు. అంతకు ముందు చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
అందరి మధ్య 40 కిలోల కేక్‌ను చంద్రబాబు కట్ చేశారు. అటు నటి శ్రీదేవి మృతికి సమన్వయ కమిటీ సంతాపం తెలిపింది. శ్రీదేవి మృతి బాధాకరమని.. మన రాష్ట్రంలో పుట్టిన ఆమె జాతీయస్థాయి సినిమా రంగంలో రాణించారన్నారు.
శ్రీదేవి మృతి పట్ల రకరకాల వాదనలు వస్తుండటం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారు.