VIZAGVISION:Another mega university in AP,Amaravathi….ఏపీలో కొలువు తీరనున్న మరో మెగా విశ్వవిద్యాలయం.ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కుదిరిన ఒప్పందం
ఆంధ్రప్రదేశ్‌లో మరో మెగా విశ్వవిద్యాలయం కొలువు తీరబోతోంది. మన రాష్ట్రంలో ఉన్నత విద్యను ప్రోత్సహించి ఇక్కడి విశ్వవిద్యాలయాలకు సహకారం అందించడానికి ‘కామన్వెల్త్ ఆఫ్ పెన్సిల్వేనియా’ ముందుకొచ్చింది. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెగా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ‘పెన్సిల్వేనియా స్టేట్ సిస్టమ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్’ చొరవ తీసుకుంటుంది. ఈ సందర్భంగా పెన్సిల్వేనియా రాయబారి కనికా చౌదరి నేతృత్వంలోని ఒక ఉన్నతస్థాయి బృందం గురువారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యింది. పెన్సిల్వేనియా స్టేట్ సిస్టమ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పీటర్ గార్లాండ్, ఇండియానా యూనివర్శిటీ అకడమిక్ వ్యవహారాల కార్యదర్శి డాక్టర్ టిమోతి ఎస్ మోర్లాండ్, రుయా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుహాస్ పెడ్నేకర్ ఈ బృందంలో ఉన్నారు.
అనేక రంగాలలో దూసుకుపోతున్న ఏపీతో కలిసి పనిచేయడానికి ఆసక్తితో ఉన్నట్టు ఈ బృందం ముఖ్యమంత్రికి వివరించింది. ప్రి-యూనివర్శిటీ కార్యక్రమాలు, స్టూడెంట్ కౌన్సిలింగ్, ఎన్రోల్మెంట్, విద్యార్థులు, బోధకుల పరస్పర మార్పిడి కార్యక్రమాలు, వృత్తిపరమైన అభివృద్ధి కోసం అధ్యాపకులకు అవసరమైన శిక్షణ, పరిశోధన, ప్రోగ్రామ్ డెవలప్మెంట్, కోర్సుల రూపకల్పన, వేసవి శిక్షణ వంటి అకడమిక్ కార్యకలాపాలు, ఇంకా పాలనపరమైన పలు వ్యవహారాలలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
ముఖ్యమంత్రి సమక్షంలో పెన్సిల్వేనియా స్టేట్ సిస్టమ్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్‌తో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు లెటర్ ఆఫ్ ఇంటెంట్ తీసుకుంది. దీని ప్రకారం వివిధ అంశాలలో ఏపీలోని విశ్వవిద్యాలయాలకు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సహకారం అందిస్తాయి. దాదాపు లక్షమంది ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉపకరించేలా పెన్సిల్వేనియా వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటుంది. విద్య, సాఫ్ట్ట్వేర్ నైపుణ్యం, వ్యవస్థాపక రంగాలలో ఏపీ సాధించిన మైలురాళ్ల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ బృందానికి చెప్పారు. ఆంగ్ల, గణితాలు ఇక్కడి విద్యార్థుల ప్రధాన బలమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను నాలెడ్జ్ హబ్‌గా, ఎడ్యుకేషన్ స్టేట్‌గా తీర్చిదిద్దుతున్న వైనాన్ని వివరించారు. ఆహార శుద్ధి, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి అంశాలలో అవకాశాలు బాగా ఉన్నందున వాటిపై ప్రధానంగా దృష్టి పెట్టామని ఏపీఈడీబీ కార్యనిర్వాహక అధికారి జాస్తి కృష్ణకిశోర్ ఈ సందర్భంగా ప్రతినిధి బృందానికి చెప్పారు. ఉభయుల మధ్య కుదిరిన అవగాహనను వాస్తవ రూపంలోకి తీసుకువెళ్లడానికి అవసరమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తామని డాక్టర్ గార్లాండ్ ముఖ్యమంత్రికి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు డైనమిజం చూసి ఆశ్చర్యపోతున్నామని, ఏపీతో కలిసి పనిచేయడం తమకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి పెన్సిల్వేనియా లెఫ్టినెంట్ గవర్నర్ మైక్ స్టాక్ ఇచ్చిన వీడియో సందేశాన్ని ఈ బృందం ప్రదర్శించింది. కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ తదితరులు పాల్గొన్నారు.