దిల్లీ: ఏపీలో రహదారులపై రోడ్డుషోలు, సభలు, సమావేశాల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 1పై విచారణ ముగిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

ఆ జీవోను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది.
ప్రస్తుత పరిస్థితుల్లో జీవో నంబర్ 1పై జోక్యం చేసుకోలేమని.. ఏపీ హైకోర్టు సీజే ధర్మాసనం దీనిపై విచారణ చేపడుతుందని సీజేఐ ధర్మాసనం తెలిపింది. వాద, ప్రతివాదులిరువురూ డివిజన్ బెంచ్ ముందు అన్ని అంశాలు ప్రస్తావించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 23న జీవో నంబర్ 1పై విచారణ చేపట్టాలని హైకోర్టుకు సూచించింది.
రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు: రామకృష్ణ
జీవో నంబర్ 1పై సుప్రీంకోర్టు ఆదేశాలు ఏపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. హైకోర్టులోనే కేసు విచారణ జరగాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలను ఇబ్బంది పెట్టేందుకే జీవో నంబర్ 1ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ఆ జీవోను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.