న్యూఢిల్లీ:కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికకు రంగం సిద్ధమైంది. వచ్చే నెలాఖర్లో ఆయన పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు చేశారు. అక్టోబర్ 3వ తేదీకల్లా పార్టీ సంస్థాగత ఎన్నికలు పూర్తి చేసుకుని, అధ్యక్ష ఎన్నికకు ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని ఆయా రాష్ర్టాల పీసీసీలకు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ ఆథారిటీ (సీఈఏ) ఛైర్మన్ ముల్లపల్లి రామచంద్రన్ ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్లో జరిగే పార్టీ ప్లీనరీలో సోనియాగాంధీ అధికారికంగా రాహుల్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని సీనియర్ నేతలు తెలిపారు.
ఈ ఏడాది పార్టీ అధ్యక్షునిగా రాహుల్‌ను, కొత్త కార్యవర్గాన్నీ ఎన్నుకోనున్నారు.
అక్టోబర్ 3న పీసీసీ అధ్యక్షులు, ప్రదేశ్ రిటర్నింగ్ ఆఫీసర్స్ (పీఆర్ఓ)లతో పాటు సంస్థాగత ఎన్నికల ఇన్ఛార్జిలతో సీఈఏ సమావేశం కానుంది. ఈ సమావేశంలో అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్‌ను ఖరారు చేస్తారు. రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక సీడబ్ల్యూసీలో భారీ మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ రాహుల్ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ప్రకటన కూడా చేశారు. ప్రియాంక గాంధీకి కూడా పార్టీలో క్రియాశీల పదవి కట్టబెట్టాలని సోనియా గాంధీ భావిస్తున్నారు.
ప్రియాంకను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేస్తే బావుంటుందని ఇటీవల సీడబ్ల్యుసీ సమావేశంలో ఆమె వెల్లడించినప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్తోపాటు పలువురు సీనియర్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్షుడిగా రాహుల్ ఎన్నిక తరువాత సోనియా గాంధీ యూపీఏ ఛైర్పర్సన్ పాత్రకే పరిమితం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రతిపక్షాలన్నీ మోదీ వ్యతిరేక ఫ్రంట్‌ను ప్రారంభించాలనుకుంటున్నాయి. దీనికి సోనియా నేతృత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. పార్టీలో యువరక్తాన్ని నింపి వచ్చే ఎన్నికల నాటికి పార్టీకి కొత్త రూపురేఖలు తీసుకురావాలని ఆమె భావిస్తున్నారు