న్యూ ఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం తలపెట్టిన ‘స్వచ్చతా హీ సేవా’ కార్యక్రమంలో భాగం కావాలని రాజకీయ, సినిమా, బిజినెస్ ఇలా ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. లేఖలో మీకున్న ప్రజాదరణతో అందరిలో చైతన్యం తీసుకురావాలని కోరారు. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారు. మోదీ లేఖకు రజనీకాంత్ వెంటనే స్పందించారు. మీరు తలపెట్టిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమానికి నా పూర్తి మద్దతు ఉంటుందని మోదీని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. ట్వీట్లో పరిశుభ్రత దైవభక్తితో సమానమని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అభిమానులు సూపర్ స్టార్ రాజకీయ ప్రవేశం కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే ఇటీవలి కాలంలో సీనియర్ నటుడు కమల్‌హాసన్ ‘త్వరలో కొత్త పార్టీ ప్రారంభించబోతున్నా. రజనీ రాజకీయాల్లోకి వస్తే చాలా సంతోషం. సినిమాల పరంగానే మా ఇద్దరి మధ్య పోటీ ఉంది. కీలక సమస్యలపై గతంలో మేం చర్చించుకున్న దాఖలాలు ఉన్నాయి. ఆయన మా పార్టీలోకి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తా. రజనీతో కలిసే పార్టీని ముందుకు తీసుకెళ్తా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.