కన్యాశుల్కం నాటక ప్రదర్శన 125 వసంతాల వేడుక 26,27,28 తేదీల్లో సాగరతీరంలో చరిత్రాత్మక కార్యక్రమం
వేదిక విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం28న విజయనగరంలో గౌరవ రజత ఫలక ఏర్పాటు
ఉత్తరాంధ్రలో మూడు రోజులు కళ..కలం. విశాఖ తీరాన కావ్యసుధామధురం. ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణాలన కన్యాశుల్క నాటక ప్రదర్శనం. గురజాడవారి కన్యాశుల్కం నాటకప్రదర్శనకు 125 వ వసంతోత్సవం. తీరమంతా తీయగా ఉలిక్కిపడే సందర్భం. గురజాడ సాహితీ సుగంధాలు మోసుకొస్తున్నవారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ అయితే, ఆయన కన్యాశుల్కం నాటకాన్ని సజీవంగా కళ్లముందు ఆవిష్కరించునున్నది మాత్రం మొజాయిక్ సాహితీ సంస్థ. ‘ఈ వూళ్ళో నారదుడు వచ్చి పాడితే నాలుగు దమ్మిడీ లివ్వరు’, ‘బుద్ధికి అసాధ్యం ఉందేమో కానీ, డబ్బుకు అసాధ్యం లేదు’ అనే మధురవాణిని, తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’ అంటూ అగ్గిరాముడయిన అగ్నిహోత్రావధానిని, ‘డామిట్ కథ అడ్డంగా తిరిగింది’ అని పలాయనం చిత్తగించే గిరీశాన్ని, ‘ఏదీ ఒక పర్యాయం అబ్బీ మీరూ ఇంగిలీషులో మాట్లాడండి నాయనా’ అని ఆసక్తిగా గిరీశాన్ని అడిగే వెంకమ్మ’. సొరాజ్యం వస్తే మా ఊరి కనిస్టీబుకి బదిలీ అవుతుందా బాబయ్యా? అనే బండివాడు.. వీళ్లందరూ కళ్లముందుకొచ్చి ‘కళ..కలం’ సృష్టించబోతున్నారు.
గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకం 125 సంవత్సరాల వేడుకలు ఈనెల 26,27,28 తేదీలలో విశాఖ, విజయనగరం కళావేదికలపై నిర్వహించనున్నారు. రాష్ట్రప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, మొజాయిక్ సాహిత్య సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకమైన ఈ కళా, సాహితీ కార్యక్రమాలు ఏర్పాటవుతున్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబిలీ హాలులో కన్యాశుల్కం 125 ఏళ్ల వేడుక, సందర్భం, చారిత్రక ప్రాధాన్యంపై జాతీయస్థాయి చర్చా గోష్ఠి ఉంటుంది. ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. సుప్రసిద్ధ కవయిత్రి జగద్ధాత్రి, రామతీర్ధ, స్వామి తదితరులు ఈ కార్యక్రమాలకు హాజరుకానున్నారు.
ఈనెల 26 (శనివారం) ఉదయం 9 గం. 30 నిమిషాలకు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. తొలి సదస్సు ఉదయం 11 గం. 45 నిమిషాలకు ఆరంభమవుతుంది. , రెండో సదస్సు మధ్యాహ్నం 2 గం. నుంచి సాయంత్రం 4 గం. దాకా కొనసాగుతుంది. సాయంత్రం 4 గం. నుంచి 6 గం. వరకు ‘యువస్వరాలు’ ప్రత్యేక కార్యక్రమం ఆహూతులను అలరించనుంది. విఖ్యాత కవి, గురజాడ కన్యాశుల్కం వేడుకల నిర్వహణలో ముఖ్యభూమిక పోషిస్తున్న రామతీర్ధ రచించిన ‘జెండాపై గురజాడ-సాంస్కృతికాంజలి పుస్తకావిష్కరణ సభ శనివారం సాయంత్రం 6 గం. నుంచి 7. గం. దాకా కొనసాగుతుంది.
27 వతేదీ (రెండో రోజు)
27వ తేదీ ఆదివారం ఉదయం ప్రారంభ చర్చాగోష్టి ఉదయం 9 గం.30 నిమిషాల నుంచి 11 గం..45నిమిషాలదాకా ఉంటుంది. తర్వాత 2వ, 3వ సదస్సులు నిర్వహిస్తారు. సాయంత్రం విశిష్ట అతిథులు పాల్గొనే వేడుకలో సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో విశిష్టులను సత్కరిస్తారు. సాయంత్రం 5.గం. 30 నిమిషాలకు మొజాయిక్ సాహిత్య సంస్థ నేతృత్వంలో గురజాడవారి ‘కన్యాశుల్కం’ నాటక ప్రదర్శన ప్రేక్షకులను సమ్మోహితుల్ని చేయనుంది.