విశాఖ: రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని, అదనంగా మరింత సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఇప్పటికే పలు కేంద్ర సంస్థలను ఏర్పాటుచేశామని, మరిన్ని సంస్థలను ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు. రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని, పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని మంత్రా ఉద్ఘాటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైన పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. విభజన హామీలన్నింటినీ వరుసగా అమలు చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏక ఆలోచనా విధానంలో పాలన సాగుతుందని అరుణ్ జైట్లీ ప్రశంసించారు. రాష్ట్రాభివృద్ధి 14 నుంచి 15 శాతానికి చేరేందుకు దోహదపడే అనేక వనరులు వున్నాయని చెప్పారు. ఏపీ రెండంకెల వృద్ధి సాధిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. ఆర్థికాభివృద్ధి సాధించేందుకు అనువైన పలు అవకాశాలు వున్నాయని అన్నారు. అందువల్లే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు కేంద్రంగా మారిందని అన్నారు. రాజధాని నగరం అమరావతి నిర్మాణం, పోలవరంతో సాగు, విద్యుత్తు ప్రాజెక్టులు, నగరాల అభివృద్ధి కోసం టౌన్‌షిప్‌లు, నౌకాశ్రయాలు నిర్మించేందుకు అవకాశం ఉందని అన్నారు. అందుకే అందరూ ఏపీ వైపు చూస్తున్నారని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని అరుణ్‌జైట్లీ అన్నారు