విమానాశ్రయ సేవల్లో విశాఖ విమానాశ్రయం అత్యుత్తమ ప్రతిభ..
మేజర్ ఎయిర్‌పోర్టుగా మారినప్పటి నుంచి ఇదే రికార్డు కొనసాగిస్తుంది ..
అంతర్జాతీయంగా 75వ స్థానం… విశాఖ విమానాశ్రయం మేజర్ విమానాశ్రయంగా మారాక.. 2018 నుంచి ప్రపంచంలోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని సేవల ర్యాంకింగ్‌లతో పోటీ పడుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయాల కౌన్సెల్ (ఏసీఐ) ప్రతీ మూడు నెలలకూ ఈ ర్యాంకింగ్‌లను విడుదల చేస్తోంది. వారిచ్చిన నివేదిక ప్రకారం విశాఖ పరంగా అత్యుత్తమ ప్రతిభ నమోదైంది. అంతర్జాతీయంగా 75వ ర్యాంకు సాధించింది.ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ప్రపంచవ్యాప్త అంతర్జాతీయ విమానాశ్రయాల సేవల నాణ్యతపై ఏసీఐ నివేదిక ఇచ్చారు. ఇందులో 5 పాయింట్లకు గానూ 4.60 పాయింట్లను విశాఖ సాధించి 75వ ర్యాంకు సొంతం చేసుకుంది. గతేడాది చివరి త్రైమాసికంగా 4.55 పాయింట్లు సాధించి 79వ ర్యాంకులో నిలిచింది. మేజర్ ఎయిర్‌పోర్టు అయిన తర్వాత జరిగిన తొలి సర్వేలో మాత్రం 221వ ర్యాంకు సాధించి మెల్లిగా సేవల్ని మెరుగుపరుస్తూ విశాఖ ఖ్యాతిని ముందు నిలిపింది. పార్కింగ్ , పాస్‌పోర్టు ఐడీల ఇన్స్పెక్షన్ , వివిధ విభాగాల సిబ్బంది పనితీరు, భద్రతా సిబ్బంది పనితీరు, మెరుగైన తనిఖీలు, ఒక విమానం వచ్చాక ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనువైన కనెక్టివిటీ , భోజన వసతులు , షాపింగ్‌కు అనువైన సౌకర్యాలు , అందుబాటులో వైఫై , మరుగుదొడ్ల పరిశుభ్రత , టెర్మినల్ భవనంలో పారిశుద్ధ్యం ,బ్యాగేజీ డెలివరీ ,కస్టమ్స్ సేవలు మొదలగు వాటిలో విశాఖ విమానాశ్రయం మెరుగైన ప్రగతి సాధించింది. 2018-19కి గానూ అంతర్జాతీయ విమానాశ్రయాల సేవల నాణ్యత 4.75 పాయింట్లుగా ఏసీఐ నిర్ణయించింది. ఈ ప్రమాణాన్ని సాధిస్తేనే అంతర్జాతీయంగా ఉత్తమంగా ఉన్నట్లు లెక్క. కానీ భారతదేశంలో ఈ ర్యాంకింగ్లకోసం 24 విమానాశ్రయాలు పోటీపడగా.. కేవలం 7 మాత్రమే ఈ నాణ్యతను సాధించగలిగాయి. మంగళూరు, అహ్మదాబాద్, త్రివేండ్రం, ఇండోర్, వారణాసి, లక్నో, రాయ్‌పూర్ విమానాశ్రయాలు ఈ ఘనతను సాధించాయి. ఈ ప్రమాణానికి విశాఖ విమానాశ్రయం 0.15పాయింట్ల దూరంలో ఉండిపోయింది. కొన్ని విభాగాల్లో మెరుగు పడకపోవడం వల్లే ఈ ఘటనకు దూరమైందని చెప్పాలి. అందుబాటులో ట్రాలీలు, చెకింగ్ క్యూలు, అక్కడి సిబ్బంది పనితీరు, విమానాల రాకపోకల సమాచారంలో కచ్చితత్వం, ఏటీఎం వసతి, అవసరమైన మరుగుదొడ్లు తదితర అంశాల్లో గతసారి ప్రతిభ కన్నా వెనకడుగులో ఉంది. అలాగే ‘విమానాశ్రయంలో మాకిక్కడ పూర్తి రక్షణ ఉంది’ అని ప్రయాణికులు పూర్తిస్థాయిలో భావించలేకపోతున్నట్లు నివేదికలో వెల్లడించారు. ఇది చాలా కీలకమైన అంశం. ఈ కోణంలో విమానాశ్రయ అధికారులు మరింతగా శ్రమించాల్సి ఉంది.
వాయిస్- ప్రపంచవ్యాప్తంగా సర్వేలో పాల్గొన్న విమానాశ్రయాల సగటు స్కోర్ 4.25 పాయింట్లుగా ఉండగా విశాఖ దీనికి మించి ఉండటం ఊరటనిచ్చే అంశం. మంగుళూరు విమానాశ్రయం దేశంలోనే ఉత్తమంగా మారింది. మరోవైపు అమృత్సర్, తిరుచ్చి, కోయంబత్తూరు, పట్నా, రాంచి, జైపూర్, పోర్టుబ్లెయిర్ విమానాశ్రయాలకన్నా విశాఖ విమానాశ్రయం ముందు నిలవడం గర్వించదగ్గ విషయం.