తమిళనాట జల్లికట్టు ఉద్యమం ఏ రేంజ్లో జరిగిందో తెలిసిందే. అది కాదన్నట్టు.. రాష్ట్రంలో (తమిళనాడు) కూల్ డ్రింక్‌ల నిషేధంపై ఉద్యమం రగులుతోంది. పలు అనారోగ్యాలకు కారణమవుతోందంటూ వాటిని బ్యాన్ చేయాల్సిందిగా ఇప్పటికే చాలా సార్లు ధర్నాలు కూడా చేశారు. ఇప్పటికే సినిమా థియేటర్లలో కూల్ డ్రింకులను బ్యాన్ చేసేశారు. అయితే.. అది స్వతహాగా మనలో మార్పు రావాలని భావిస్తోంది తమిళ యువత. ఇప్పుడు అదే విషయంపై స్పందించాడు ఏస్ డైరెక్టర్ మురుగదాస్. బహుళజాతి సంస్థలకు చెందిన శీతల పానీయాలను మూడేళ్లుగా దూరం పెడుతున్నానని చెప్పుకొచ్చాడు. కత్తి సినిమా కథ రాస్తున్న సమయంలోనే.. కథను వ్యక్తిగతంగా అడాప్ట్ చేసుకుని కూల్ డ్రింకులను తాగడం మానేశానని అంటున్నారు. ఇకపై అతడి సినిమాలకు సంబంధించిన షూటింగ్ స్పాట్లో కూడా కూల్ డ్రింకులను నిషేధిస్తానని ఘంటాపథంగా చెప్పాడు. విచిత్రంగా దీనికి మహేశ్‌బాబుకు లింకు పెడుతున్నారు అక్కడి సినిమా అభిమానులు. మురుగదాస్ నో అంటే.. మహేశ్ మాత్రం ఏకంగా ఓ బహుళజాతి సంస్థకు చెందిన కూల్‌డ్రింక్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారంటూ పెదవి విరుస్తున్నారట. మరి, దానిపై మురుగదాస్ ఏమంటాడో అని అంటున్నారట వారు. అంటే డైరెక్టర్ శీతల పానీయాలకు నో చెబుతున్నా.. మురుగదాస్ హీరో మాత్రం వాటికి ప్రచారం నిర్వహించడమేంటి విచిత్రంగానూ అంటూ వ్యాఖ్యానిస్తున్నారట.