భోపాల్: ప్రజా సమస్యలను సామాజిక మాధ్యమం ద్వారా అత్యంత వేగంగా తెలుసుకుని పరిష్కరించడంలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఎప్పుడూ ముందుంటారని మరోసారి నిరూపించుకున్నారు. నాలుగు రోజుల క్రితమే హృద్రోగ సమస్యతో పుట్టిన ఓ బాలుడి శస్త్రచికిత్సకు సాయం చేసేందుకు సుష్మ ముందుకు వచ్చారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్య చికిత్సకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. భోపాల్‌లోని ఓ ఆసుపత్రిలో దేవేశ్ శర్మ బార్య వందన శర్మ ఈనెల 23న ఓ బిడ్డకు తల్లి అయ్యారు. హృద్రోగ్య సమస్యతో బాలుడు పుట్టడంతో దేవేశ్ తన కుమారుడి చికిత్సకు సాయం చేయాల్సిందిగా ట్విట్టర్ పోస్ట్‌లో సుష్మకు మొరపెట్టుకున్నారు. శస్త్ర చికిత్సకు భోపాల్‌లో వైద్యులెవరూ లేరని, తక్షణం చికిత్స జరగాల్సి ఉందని ఆయన సుష్మ దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన సుష్మా స్వరాజ్ ఆ కుటుంబ సభ్యులతో అందుబాటులో ఉండేదుకు వీలుగా ఫోన్ నెంబర్ ఇవ్వాలని సూచించారు. అనంతరం దేవేశ్ కుటుంబసభ్యుల దగ్గరకు అధికారులను పంపారు. పిల్లవాడి మెడికల్ రిపోర్ట్‌లను ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లకు పంపే ఏర్పాటు చేసారు. భోపాల్ కార్యాలయం ద్వారా దేవేశ్ కుటుంబసభ్యుల నుంచి సమాచారం సేకరించామని, సాధ్యమైనంత త్వరలో ఎయిమ్స్ కార్డియాక్ సర్జరీ అధిపతి డాక్టర్ బలరాం అయిరాన్ ద్వారా శస్త్రచికిత్స జరుగుతందని మరో ట్వీట్లో సుష్మ తెలిపారు. మంత్రి అందించిన సహకారానికి దేవేశ్ వెంటనే కృతజ్ఞతలు తెలిపారు. సుష్మ ట్వీట్ అనంతరం తమ చిన్నారిని ఎయిర్ ఎంబులెన్స్ ద్వారా ఢిల్లీకి తీసుకువెళ్తున్నామని, సాయంత్రం లోగా ఢిల్లీ చేరుతామని ఆయన చెప్పారు. బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో దేవేశ్ పనిచేస్తున్నారు. కాగా, గత ఏడాది డిసెంబర్ 10న ఇదే ఢిల్లీ ఎయిమ్స్‌లో సుష్మాస్వరాజ్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు.