విశాఖపట్నం పోర్ట్ లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు🔴
77వ గణతంత్ర దినోత్సవాన్ని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ…పోర్ట్ స్టేడియంలో దేశభక్తి ని ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోర్ట్ చైర్ పర్సన్ డా. ఎం. అంగముత్తు, ఐఏఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ సీఐఎస్ఎఫ్ –పరేడ్ ను పరిశీలించి గౌరవ వందనాన్ని స్వీకరించారు.ఈ సందర్భంగా డా. ఎం. అంగముత్తు, ఐఏఎస్, మాట్లాడుతూ విశాఖపట్నం పోర్ట్ సముద్ర రంగంలో అగ్రగామిగా నిలుస్తూ, పబ్లిక్–ప్రైవేట్ పార్ట్నర్షిప్ (PPP) ప్రాజెక్టులు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (O&M) నమూనాలు, పునరుత్పాదక హరిత శక్తి వినియోగం వంటి అనేక వినూత్న కార్యక్రమాల ద్వారా తన ప్రత్యేకను చాటుకుంటుందని వెల్లడించారు.గౌరవ ప్రధాన మంత్రి ప్రవేశపెట్టిన “వికసిత్ భారత్” కు అనుగుణంగా పోర్ట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
విశాఖపట్నం పోర్ట్ తన సరుకు రవాణా కార్యకలాపాల్లో కొంత భాగాన్ని శ్రీకాకుళం జిల్లాలోని ములపేట పోర్ట్కు తరలించే ప్రక్రియలో ఉందని, అలాగే దుగ్గరాజపట్నంలో నౌకా నిర్మాణ కార్యక్రమంలో కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోందని తెలిపారు.పోర్ట్ పనితీరు గురించి మాట్లాడుతూ, గత ఆర్ధిక సంవత్సరంలో 82 మిలియన్ మెట్రిక్ టన్నులకుపైగా కార్గో నిర్వహించామని, ప్రస్తుత సంవత్సరంలో 90 ఎంఎంటీ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఉన్నామని, తదుపరి సంవత్సరంలో 100 ఎంఎంటీ సాధించే స్థాయికి చేరుకుంటామని తెలిపారు. ఇందుకు PPP, BOT భాగస్వాములు మరియు VPA సిబ్బంది అందిస్తున్న సంపూర్ణ సహకారం ప్రధాన కారణమని చెప్పారు.2025–26 సంవత్సరంలో, పోర్ట్ లో రూ.1500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, ఇవి పోర్ట్ వ్యవస్థను మరింత మెరుగుపరచడంతో పాటు విశాఖపట్నం నగరం, పొరుగు రాష్ట్రాలు మరియు దేశ అభివృద్ధికి తోడ్పడతాయని తెలిపారు. అలాగే దేశంలోనే అత్యంత విస్తృతమైన అంతర్గత రైల్వే అనుసంధానం VPAకు ఉందని, రోడ్డు మార్గం కూడా సమర్థవంతంగా ఉండటంతో కార్గో రవాణా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతోందని పేర్కొన్నారు.అధికారులు, ఉద్యోగులు తమ శక్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగిస్తూ, దేశ స్థాయిలో ప్రమాణాలను నెలకొల్పేలా పనిచేయాలని, VPA ఉన్నత ప్రమాణాలను కాపాడాలని ఛైర్పర్సన్ పిలుపునిచ్చారు.వేడుకలను మరింత రంగరించేందుకు దేశభక్తి నేపథ్యంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తుపాకీ కాల్పులు, శిక్షణ పొందిన గూఢచారి కుక్కల ప్రదర్శన వంటి భద్రతా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రజల అవగాహన కోసం ఏర్పాటు చేసిన సీఐఎస్ఎఫ్ ఆయుధాల ప్రదర్శన మరియు విభాగాల శకటాల పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా ఉత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు మరియు విశేష ఫలితాలు సాధించిన స్టేక్హోల్డర్లకు ప్రశంసా పత్రాలు, అవార్డులు ఛైర్పర్సన్ అందజేశారు.చివరిగా, కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు సీఐఎస్ఎఫ్ కమాండెంట్, డిప్యూటీ ఛైర్పర్సన్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, విభాగాధిపతులు, సిబ్బంది అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సంవత్సరాలుగా నిరంతర సహకారం అందిస్తున్న స్టేక్హోల్డర్లు మరియు ట్రేడ్ భాగస్వాములకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.




















