మొట్ట మొదటి సారి విశాఖపట్నం పోర్ట్ కు, డిప్యూటీ చైర్ పర్సన్ గా మహిళా ఐఏఎస్ అధికారి

శ్రీమతి రోష్ని అపరాంజి కోరాటి, ఐఏఎస్ (2011) విశాఖపట్నం పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్ పర్సన్ గా 29.12.2025న బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం పోర్ట్ లో ఈ పదవిని చేపట్టిన తొలి మహిళా ఐఏఎస్ అధికారిణిగా ఆమె చరిత్ర సృష్టించారు.
అస్సాం–మెఘాలయ కేడర్‌కు చెందిన శ్రీమతి రోష్ని అపరాంజి కోరాటి విశాఖపట్నానికి చెందినవారు. ఆమె తన విద్యాభ్యాసమంతా విశాఖపట్నంలోనే పూర్తి చేశారు. ఆమె తండ్రి విశాఖపట్నం పోర్ట్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయుడిగా సేవలందించారు. తండ్రి సేవలు అందించిన సంస్థకు ఆమె డిప్యూటీ చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించడం అత్యంత గర్వకారణం.
03 ఏప్రిల్ 1984న జన్మించిన రోష్ని, ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ డిగ్రీలో గోల్డ్ మెడలిస్ట్. జిల్లా, రాష్ట్ర మరియు కేంద్ర స్థాయిల్లో విస్తృత పరిపాలనా అనుభవం కలిగిన ఆమె, అస్సాంలో జోర్హాట్ జిల్లాకు అదనపు ఉప కమిషనర్‌గా, అనంతరం అదే జిల్లాకు కలెక్టర్ మరియు జిల్లా మజిస్ట్రేట్గా సేవలందించారు. ధేమాజీ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మజిస్ట్రేట్గా పనిచేసి గ్రామీణాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధిన శాఖలలో తనదైన ముద్ర వేశారు.
అదేవిధంగా అస్సాం ప్రభుత్వంలో ప్రాథమిక విద్యాశాఖ కార్యదర్శిగా, సర్వ శిక్షా అభియాన్ (SSA) మిషన్ డైరెక్టర్‌గా సేవలందించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శిగా మరియు ARIAS సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు.
విశాఖపట్నం పోర్ట్ అథారిటీకి నియామకానికి ముందు, కేంద్ర డిప్యూటేషన్‌లో విశాఖ స్పెషల్ ఎకనామిక్ జోన్ (VSEZ)లో జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్‌గా పనిచేశారు. 2018లో ప్రజాపరిపాలనలో విశిష్ట సేవలకు గాను ప్రధాని అవార్డు సహా అనేక పురస్కారాలు పొందిన ఆమె, సమర్థవంతమైన ప్రజాసేవకురాలిగా విశేషంగా గుర్తింపు పొందారు.















