శుభాకాంక్షల వెల్లువ వర్శిటీ నలుమూలల సంతోషాల వేడుకలు వేడుకల్లో భాగమవుతున్న విదేశీ విద్యార్థులు వర్సిటీ ఉన్నతిపట్ల వృద్ధుల సంతోషం… అధికారులకు ఆశీస్సులు ఆంధ్రవిశ్వవిద్యాలయం సమున్నత గౌరవాన్ని సాధించడంతో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వర్సిటీలో నలుమూలల సంతోషాల వేడుకలు జరుపుకుంటున్నారు. వేడుకల్లో విదేశీ విద్యార్థులు సైతం భాగమవుతూ ఏయూ తమది అనే భావనతో ప్రపంచానికి చాటుతూ, ఏయూను సరికొత్తగా పరిచయం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ విశ్వవిద్యాలయం ఏయూ నిలుస్తూ నాక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ 3. 74 సిజిపిఏ సాధించడంతో ఈ ఘన విజయాన్ని వర్సిటీ విద్యార్థులు, ఉద్యోగులు అస్వాదిస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా పడ్డ శ్రమకు ఫలితంగా నేడు కనిపించడం, దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఏయూ నిలవడంతో సంతోషాలకు అవధులు లేకుండా ఉన్నాయి.
ఆశీస్సుల వెల్లువ…….
ఆంధ్రవిశ్వవిద్యాలయం నాన్లో అత్యుత్తమ స్థానం సాధించిన విషయాన్ని వార్తాపత్రికల్లో చదివిన నగరానికి చెందిన డి.పార్వతి (87 సంవత్సరాలు) స్వయంగా ఏయూకు తన కుమారుడు డి. సాయి శివ ప్రసాద్ సహాయంతో వచ్చారు. వీసీ ఆచార్య ప్రసాద రెడ్డిని కలసి తన సంతోషాన్ని పంచుకుని, ఆశీస్సులు అందించారు. ఏయూ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. అనంతరం పలువురు విశ్రాంత ఆచార్యులు, ఏయూ విశ్రాంత ఉద్యోగులు సైతం వీసీ ప్రసాద రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు.
కళాశాలల్లో వేడుకలు….
ఏయూ సాధించిన ఈ విజయాన్ని వర్సిటీలో ఘనంగా పండుగ వాతావరణంలో విద్యార్థుల సమక్షంలో వేడుకలు జరుపుకుంటున్నారు. ఏయూ ఫార్మశీ కళాశాలలో విద్యార్థులతో కలసి రిజిస్ట్రార్ ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్ వేడుకల్లో పాల్గొన్నారు. టపాసులు కాల్చి కళాశాల బయట విద్యార్థులు సందడి చేసారు. ప్రధానంగా విద్యార్థులు వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాస్క్‌లను ధరించి, థ్యాంక్యూ వీసీ సార్ అంటూ నినాదాలు చేసారు. వుయ్ లవ్ ఏయూ అంటూ పెద్దెత్తున నినాదాలు చేసారు. అనంతరం న్యాయ
కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో సైతం ఇదే విధమైన ఆనందోత్సాహాలు వెల్లి విరిసాయి. క్రీడా విభాగంలో విదేశీ విద్యార్థులే స్వయంగా చొరవ తీసుకుని కేక్ కట్‌చేసి, వేడుకలు జరిపి సంతోషాలను పంచుకున్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ఆచార్య వై. రాజేంద్ర ప్రసాద్, వి. విజయలక్ష్మి, క్రీడా విభాగాధిపతి ఆచార్య పి. పల్లవి, ఆచార్య ఎన్. విజయ్ మోహన్, ఆచార్య ఏ.కె.ఎం పవార్, ఆచార్య గిరిజా శంకర్ తదితరులు పాల్గొన్నారు.

















