Physically Disabled People For Artificial legs Equipment Center in Visakhapatnam…పుట్టుకతో కాళ్లు పోగొట్టుకొని నడవలేని వారికి ఆ కేంద్రం ఒక ఆసరా. ప్రమాదవశాత్తు నడక కోల్పోయిన వారిని కృత్రిమ కాళ్లతో నడిపించే ఆధారచక్రం ఆ కేంద్రం. ఎంతోమంది అభాగ్యులకు నడకను ప్రసాదించిన విశాఖలోని కృత్రిమ అవయవ నిర్మాణ కేంద్రంపై Vizagvision ప్రత్యేక కథనం…….
కాళ్లు కొల్పోయిన వారికి నేనున్నానంటూ… చేయూతనందిస్తుంది… ఆంధ్రప్రదేశ్ వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృత్రిమ అవయవ నిర్మాణ కేంద్రం. విశాఖ నగరం పెదవాల్తేరులోని రాణిచంద్రమతీదేవి వికలాంగుల ఆసుపత్రి ప్రాంగణంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు కృత్రిమ అవయవాలు తయారు చేసి సరఫరా చేస్తోంది.కాళ్లు లేక నడవలేని అభాగ్యులకు ఈ కేంద్రం కృత్రిమ అవయవాలు అందిస్తూ… సక్రమంగా నడిపిస్తోంది. తెల్లరేషన్ కార్డు ఉన్న వికలాంగులకు ఉచితంగా కృత్రిమ కాలు అమర్చి… వారికి నడక ప్రసాదిస్తోంది.విశాఖ జిల్లాతోపాటు రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి కృత్రిమ అవయవాల కోసం ఈ కేంద్రానికి వస్తారు. నడక కోల్పోయిన వారికి కాలిపర్స్ లింబ్స్ చేతికర్రలు ప్రత్యేకంగా తయారు చేస్తోంది. చుట్టుపక్కల జిల్లాల్లో ప్రతినెల క్యాంపులు నిర్వహించి అనేక మందికి కృత్రిమ అవయవాలు పంపిణీ చేస్తోంది ఈ కేంద్రం. యంత్ర సామగ్రి సాయంతో తాము చేస్తున్న పనిలో సామాజిక బాధ్యత మరింత ఆనందాన్ని ఇస్తుందని ఇక్కడి ఉద్యోగులు అంటున్నారు.గత మూడు దశాబ్దాలుగా అనేక మంది వికలాంగుల కళ్ళల్లో ఆనందం వెలుగుచూసిన ఈ కేంద్రానికి ఆధునిక హంగుల సమకూరిస్తే… సేవలు విస్తృతమవుతాయని ఇక్కడి అధికారులు ఆశాభావంతో ఉన్నారు
















