ఆర్టికల్ 370 ని ఆధారం చేసుకొని ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, ఎన్సీపీలను దునుమాడారు,Vizagvision…మహారాష్ట్రలోని జల్గావ్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ… ‘‘ఈ ప్రతిపక్షాలు 370 ని తిరిగి తీసుకొస్తామని వ్యాఖ్యానించాయి.
వారి మొసలి కన్నీళ్లతో ప్రజలను మోసం చేస్తున్నారు. వాళ్లు 370 తిరిగి తీసుకురాగలరా? భారత ప్రజలు అందుకు అంగీకరిస్తారా? దీనిని ఒప్పుకుంటారా?’’ అని విరుచుకుపడ్డారు.
జమ్మూ, లడఖ్ ప్రాంతాలు కేవలం మన భూభాగాలు మాత్రమే కాదని, ఆ రెండూ దేశానికి ‘మణిమకుటాలు’ అని అభివర్ణించారు.
ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత భద్రతాపరంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని, ఇంటా, బయట ప్రతికూల శక్తులు విజృంభించినా, సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొనడానికి కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు.
ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి, ఫడ్నవీస్‌ను తిరిగి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలని మోదీ మహారాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నాలుగు నెలల క్రితం మీరు సరికొత్తగా ఆవిష్కృతం కానున్న భారతానికి ఓటు వేశారు.
ప్రపంచం మొత్తం కూడా ఈ కొత్త భారత ఉత్సాహాన్ని చూస్తోంది. మీ ఓటు భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అందంగా అలంకరించింది.
న్యూ ఇండియా జోష్ మోదీ వల్ల కాదని, కేవలం ప్రజల ఓటు ద్వారానే సాధ్యమవుతుందని మోదీ స్పష్టం చేశారు.
















