Cyclone “Fani” Effects More Than “Titli” Alert Beach Areas Heavy Rains to Srikakulam,Vizag Vision..
తి భారీ తుఫాన్‌గా ఫణి..!!
2, 3 తేదీల్లో అత్యంత తీవ్ర ప్రభావం
118 నుంచి 150కి.మీ వేగంతో ప్రచండ గాలులు
భారీ నుంచి అతి భారీ వర్షాలు.
తితలీని మించిన ఉపద్రవం
అప్రమత్తమైన అధికారులు
ఈ నెల 2న గంటకు 118నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే మండలాలు : కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస,
88 నుంచి 103కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే మండలాలు: కంచిలి, మందస, పలాస, సంతబొమ్మాళి, పోలాకి
62 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో : నందిగాం, టెక్కలి, సారవకోట, జలుమూరు, గార, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం.
ఇవికాకుండా జిల్లావ్యాప్తంగా ఇతర మండలాల్లో 50కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీస్తాయి.
అదే రోజు 11 నుంచి 20సెంటీమీటర్ల మధ్య అతిభారీ వర్షాలు కురవనున్న మండలాలు : కవిటి, కంచిలి, సోంఏట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం, మెళియాపుట్టి, టెక్కలి, సంతబొమ్మాళి, పాతపట్నం, హిరమండలం, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట, సారవకోట, సరుబుజ్జిలి, బూర్జ, నరసన్నపేట, శ్రీకాకుళం, గార, ఎచ్చెర్ల, ఆమదాలవలస, పొందూరు
3న గంటకు 118 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే మండలాలు: ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి…. 103 నుంచి 118 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే మండలాలు: సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు
ఇదీ.. జిల్లాకు ‘ఫణి’ తుఫాన్ రూపంలో పొంచి ఉన్న ముప్పు. ఒడిశా రాష్ట్రం పూరీకి సమీపంలో ఈ నెల 3న తీరం దాటనున్న నేపథ్యంలో 2న జిల్లాలో అతి భారీ వర్షాలు, ప్రచండ గాలులు వీయనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. ఎవరికి ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది.
జిల్లాకు మరో ముప్పు ముంచుకొస్తోంది. ఫణి రూపంలో తుఫాన్ మహమ్మారి మళ్లీ సిక్కోలును చిగురుటాకులా వణికించబోతోంది. తితలీ తుఫాన్‌ను మించిన విధ్వంసం సృష్టించబోతోంది. ఏకంగా 15 నుంచి 20 సెంటీమీటర్ల మేర అత్యంత భారీ వర్షంతో పాటు 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీయనున్నట్టు వాతావరణశాఖ హెచ్చరించింది. ఒడిశాలోని పూరీకి సమీపంలోగల గోపాలపూర్-చాంద్‌బలీ మధ్య 3వ తేదీన తీరం దాటనున్న ‘ఫణి’ తుఫాన్ జిల్లాపై ఈ నెల 2న అత్యంత తీవ్ర ప్రభావం చూపించబోతోంది. ఆరోజు తుఫాన్ జిల్లాలో తీరప్రాంతాన్ని తాకుతూ ఒడిశా వైపు ప్రయాణించనున్నందున ఆ సమయంలో ఉదయం నుంచి జిల్లావ్యాప్తంగా 24 మండలాల్లో అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. ఆ సమయంలో గంటకు 118నుంచి 150కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు బీభత్సం సృష్టించనున్నాయి. ముఖ్యంగా ఉద్దానంపై ఫణి అత్యంత ప్రభావం చూపనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది.
ఈమేరకు తుఫాన్ దిశ ఈ ప్రాంతం నుంచే వెళ్తున్నందున నష్టం ఇక్కడ అపారంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా 2న కవిటి, సోంపేట, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో 118 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయనున్నాయి. 88 నుంచి 103కిలోమీటర్ల వేగంతో కంచిలి, మందస, పలాస, సంతబొమ్మాళి, పోలాకి మండలాల్లో ప్రచండ గాలులు బీభత్సం సృష్టించనున్నాయి. అలాగే 62 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో నందిగాం, టెక్కలి, సారవకోట, జలుమూరు, గార, ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం మండలాల్లో గాలులు వీస్తాయి. ఇవికాకుండా జిల్లాలో ఇతర మండలాల్లో 50కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీయనున్నాయి. అటు 3వ తేదీన కూడా ఉద్దానంపై తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఆ రోజు కూడా గంటకు 118 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి మండలాల్లో ప్రచండ గాలుల బీభత్సం కొనసాగుతుంది. 103 నుంచి 118కిలోమీటర్ల వేగంతో సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో కూడా తుఫాన్ బీభత్సం సృష్టించనున్నట్లు వాతావరణ శాఖ నిర్ధారించింది.
అతి భారీ వర్షాలు..
ఫణి తుఫాన్ ప్రభావంతో జిల్లాలో రెండో తేదీన ప్రచండ గాలుల బీభత్సంతో పాటు అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ఆరోజు జిల్లావ్యాప్తంగా 24 మండలాల్లో 11.5 సెంటీమీటర్ల నుంచి 20.4 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదు కానుంది. గురువారం తితలీ సమయం కంటే అతి భారీ వర్షం కురవనుంది. ప్రధానంగా ఆ రోజు కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, నందిగాం, మెళియాపుట్టి, టెక్కలి, సంతబొమ్మాళి, పాతపట్నం, హిరమండలం, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట, సారవకోట, సరుబుజ్జిలి, బూర్జ, నరసన్నపేట, శ్రీకాకుళం, గార, ఎచ్చెర్ల, ఆమదాలవలస, పొందూరు మండలాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాక
జిల్లాను పెనుతుఫాను తాకుతున్న నేపథ్యంలో సహాయక చర్యల కోసం విశాఖ నుంచి ఐదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పిస్తున్నారు. ఇవికాక జిల్లాలో ఉన్న బృందాలు అదనంగా పని చేయనున్నాయి. రెండు,మూడు తేదీల్లో వీయనున్న ప్రచండ గాలులు, అతి భారీవర్షాలతో ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉండడంతో వేలాది కొత్త స్తంభాలతో విద్యుత్ శాఖ సన్నద్ధమవుతోంది. రణస్థలం మండలంలో 20, ఎచ్చెర్ల 11, శ్రీకాకుళం 4, ఇచ్ఛాపురం 8, గార 12, పోలాకి 6, సంతబొమ్మాళి 31, వజ్రపుకొత్తూరు 44, మందస 30, సోంపేట 25, కవిటి 46, కలిపి మొత్తం 11 తీర ప్రాంత మండలాల్లోని 237 గ్రామాల్లో ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. వారందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భావిస్తున్నారు.
ఈమేరకు బుధవారం నుంచి వీరికోసం జిల్లావ్యాప్తంగా 42 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వశాఖల్లో అధికారులు, ఉద్యోగులకు సెలవులు రద్దుచేశారు. కలెక్టరేట్‌తో సహా ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేశారు. నదీతీర ప్రాంతాల్లో గ్రామాల్లో దండోరా వేయించారు. మండలాల్లో ఎక్కడికక్కడ పంచాయతీ, అంగన్వాడీ, వీఆర్వో, ఉపాధి విభాగం అధికారులంతా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. జాతీయ రహదారులు, ఇతర ప్రధాన రహదారుల్లో చెట్లు పడిపోతే తొలగించడానికి భారీ ఎత్తున కట్టర్లు కూడా సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చారు. అలాగే తీరప్రాంత మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయడానికి కసరత్తు ప్రారంభించారు.
మలుపు తిరిగితే ముప్పే!
సిక్కోలుకు పొంచి ఉన్న ‘ఫణి’ తుఫాన్ ప్రభావం జిల్లావాసులతో పాటు అధికారుల్లో వణుకు పుట్టిస్తోంది. ‘తితలీ’ కంటే రెండింతల ప్రభావం ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు. చెన్నై నైరుతి భాగంలో కేంద్రీకృతమైన ఫణి తుఫాన్ జిల్లాలో పెను విధ్వంసం సృష్టించే అవకాశముంది. ఈ తుఫాన్ కాకినాడ ఆగ్నేయ దిశగా ప్రయాణిస్తే జిల్లాలో భారీ గాలులతో పాటు, అతి భారీ వర్షాలు కురవనున్నాయి. చెన్నై నుంచి మలుపు తిరిగితే ఇచ్ఛాపురం, పూరీ నడుమ కానీ, పూరీ-భువనేశ్వర్ వద్ద కానీ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
ఎటు వైపు నుంచి వెళ్లినా ఒడిశాపై తీవ్ర ప్రభావం ఉన్నందున జిల్లాకు వరద ముంచెత్తే ప్రమాదం ఉంది. ఎక్కడ మలుపు తిరుగుతుందోనన్న విషయం నేడు బయటపడనుంది. గతంలో 1, 2 ప్రమాద హెచ్చరికలు మాత్రమే మనకు సంభవించాయి. ఈ ఫణి తుఫాన్ మాత్రం 3,4 నెంబర్ ప్రమాద హెచ్చరికలు వాతావరణ కేంద్రం జారీ చేయటంతో అందరూ భయందోళన చెందుతున్నారు. తుఫాన్ హెచ్చరిర కేంద్రాలకు కూడా అంతుచిక్కకపోవడంతో ఈ ప్రభావం ఎవరిపై పడుతుందోనని అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్‌తో పాటు మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందించే పనిలో నిమగ్నమయ్యారు.
















