త్వరలో గజ్వేల్‌కు రైలు!
-తుది దశకు చేరిన మనోహరాబాద్- గజ్వేల్ మార్గం పనులు
-మార్చి నెలాఖరులో ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు
హైదరాబాద్/గజ్వేల్, నమస్తే తెలంగాణ: మనోహరాబాద్- కొత్తపల్లి నూతన రైలు మార్గంలో మొదటి దశ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు 32 కిలోమీటర్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో గిరిపల్లి వరకు 25 కిలోమీటర్ల దూరం పట్టాలు పరిచే పనులు దాదాపు పూర్తయ్యాయి. గిరిపల్లి నుంచి గజ్వేల్ వరకు మిగిలిన ఏడు కిలోమీటర్ల మార్గంలో పట్టాలు పరిచి లింకింగ్ పనులు చురుగ్గాసాగుతున్నాయి. మనోహరాబాద్ నుంచి నాచారంగుట్ట వరకు 8 కిలోమీటర్ల మార్గంలో భవనాలు, స్టేషన్ల పనులు 50 శాతం పూర్తయ్యాయి. గజ్వేల్ రింగ్ రోడ్డు వద్ద ఎతైన వంతెన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. తూప్రాన్ మండలంలోని రామాయపల్లి వద్ద హైవేపై బ్రిడ్జితోపాటు చిన్న చిన్న బ్రిడ్జిలు, రైల్వే స్టేషన్ల భవన నిర్మాణాలను మార్చివరకు పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
మార్చి 31నాటికి మనోహరాబాద్- గజ్వేల్ మధ్య ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో రైల్వేశాఖ కూడా మొదటి దశ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రస్తుతం కాచిగూడ, సికింద్రాబాద్ నుంచి మనోహరాబాద్ వరకు డెమో రైళ్లు నడుస్తున్నాయి. మనోహరాబాద్- గజ్వేల్ మార్గం పూర్తయ్యాక డెమో రైళ్లను గజ్వేల్ పట్టణంవరకు పొడిగించే అవకాశం ఉన్నదని అధికారవర్గాలు చెప్తున్నాయి. 2020లో సిద్దిపేట పట్టణంవరకు, 2021-22 మార్చినాటికి కొత్తపల్లివరకు రైలు మార్గాన్ని పూర్తిచేయాలనే లక్ష్యంతో పనులు సాగుతున్నాయి.
పురోగతిలో పనులు
మొదటి దశ నిర్మాణంలో భాగంగా కావాల్సిన భూమిని సేకరించి రైల్వేశాఖకు అప్పగించారు. కరకట్టల నిర్మాణం వంటి మట్టి పనులు, చిన్న చిన్న వంతెనల నిర్మాణ పనులను మార్చి 2019లోగా పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకుసాగుతున్నారు. మనోహరాబాద్- కొత్తపల్లి కొత్త రైలుమార్గంలో మొత్తం 160 వంతెనలు, ఏడు రోడ్ ఓవర్ బ్రిడ్జిలు (ఆర్వోబీలు), 49 రోడ్ అండర్ బ్రిడ్జిలు (ఆర్‌యూబీలు), 13 కొత్త రైల్వేస్టేషన్లు (క్రాసింగ్ స్టేషన్లు 8, హాల్ట్‌స్టేషన్లు 5) ఉన్నాయి. నాచారం, ఇరగవరం (హాల్ట్), గజ్వేల్, కొడకండ్ల (హాల్ట్), లకుడారం, దుద్దెడ, సిద్దిపేట, గుర్రాలగొంది (హాల్ట్), చిన్నలింగాపూర్, సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, వెదిర (హాల్ట్) తదితర కొత్త స్టేషన్లు ఉన్నాయి.
దశాబ్దాల కల త్వరలో సాకారం
సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు హైదరాబాద్- కరీంనగర్ (మనోహరాబాద్- కొత్తపల్లి) రైల్వేలైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ ప్రాంత ప్రజల కల త్వరలో సాకారం కానున్నది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణతోపాటు మూడోవంతు వ్యయాన్ని భరించనున్నది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం రైల్వేశాఖతో ఒప్పందం చేసుకోవడంతో పనుల్లో వేగం పెరిగింది. మెదక్ జిల్లాలోని మనోహరాబాద్, కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మధ్య నిర్మాణమయ్యే ఈ కొత్త రైలుమార్గానికి ప్రధాని నరేంద్రమోదీ 2016 ఆగస్టులో శంకుస్థాపనచేశారు. ఈ ప్రాజెక్టు మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల మధ్య రూ.1,160 కోట్ల అంచనా వ్యయంతో దాదాపు 151.40 కిలోమీటర్ల పొడవున రైల్వేలైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు రైల్వేశాఖ 2017-18లో రూ.350 కోట్లు, 2018-19 రైల్వే బడ్జెట్లో రూ.125 కోట్లు కేటాయించింది. ఈ కొత్త రైలు మార్గం రాష్ట్రంలోని గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ (దక్షిణ కాశీ) వంటి ప్రధాన పట్టణాల గుండా నిర్మాణమవుతున్నది.
















