జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో 33 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 20 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
క్షతగాత్రులను జగిత్యాల, కరీంనగర్ ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.
బస్సు కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో బస్సులో 62 మంది వరకు ఉన్నట్లు సమాచారం.
ప్రమాదానికి కారణమైన బస్సు జగిత్యాల డిపోకు చెందినదిగా గుర్తించారు.
కొండగట్టు ఘాట్ రోడ్డులో బస్సు కిందకు దిగుతున్న సమయంలో బ్రేక్ ఫెయిల్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని ప్రాథమికంగా భావిస్తున్నారు.
బస్సు మరో నిమిషంలో ప్రధాన రహదారికి చేరుకుంటుందనగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఘటనా స్థలంలో బంధువుల ఆర్తనాదాలతో విషాద వాతావరణం నెలకొంది.
ప్రమాదంలో బస్సు ముందు భాగం బాగా ధ్వంసం మైంది. మృతుల్లో ఎక్కువగా వృద్ధులు, మహిళలు, పిల్లలు ఉన్నారు.
సహాయక చర్యల్లో స్థానికులు నిమగ్నమయ్యారు.
మరోవైపు ఈ ప్రమాదంపై తెలంగాణా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
అటు ఆపద్ధర్మ ఆర్థిక శాఖమంత్రి ఈటల రాజేందర్ స్పందిస్తూ సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
జగిత్యాల కలెక్టర్,ఎస్పీ సహాయక చర్యల్లో నిమగ్నమైనట్టు చెప్పారు.
ప్రభుత్వం తరపున క్షతగాత్రులకు వైద్య సహాయం అందిస్తున్నట్టు చెప్పారు.