తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల్లో కదలిక మొదలైంది. వీటి ప్రభావంతో రెండు మూడు రోజులు ఓ మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఇప్పటికే గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.
విశాఖ జిల్లాలోనూ తేలికపాటి జల్లులు పడుతున్నాయి. కోస్తా అంతటా ఆకాశం మేఘావృతమైంది.
వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలకు ఉపశమనం లభించింది. గుడివాడలో 4.8 సెంటిమీటర్లు పాడేరులో 4.6, గంట్యాడ 3.9, మెంటాడ 3.8, ఎస్.కోటలో 3.6, గజపతినగరంలో 3.3, వెంకటగిరిలో 2.8, యలమంచిలిలో 2.7 సెంటీమీటర్ల చొప్పున శుక్రవారం ఉదయం వరకు వర్షపాతం నమోదైంది.
మరోవైపు వాయువ్య బంగాళాఖాతంపై 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైంది.
బీహార్ నుంచి జార్ఘండ్ మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులో వాయవ్య బంగాళాఖాతం వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది.
అస్సాం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు, జార్ఘండ్, బీహార్, మధ్యప్రదేశ్‌లలో రెండు మూడు రోజుల్లో నైరుతి విస్తరించేందుకు ఆవర్తనంతో అనుకూల వాతావరణం నెలకొన్నట్లు ఐఎండి తెలిపింది.