శ్రీవారి పాదాల మార్గంలో ఏనుగుల మంద హల్చల్ చేసింది*.
అక్కగార్ల గుడి వద్దకు ఏనుగుల గుంపు వచ్చినట్లు ఆనవాళ్లను టీటీడీ అటవీ, విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
దీంతో అప్రమత్తమైన అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీవారి పాదాల మార్గంలో ఆంక్షలు విధించారు.
నడకదారి భక్తులకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు.
తిరుమల నారాయణగిరి శ్రేణిలో గజరాజులు హల్చల్ చేస్తున్నాయి. గత వారం రోజులుగా శ్రీవారి పాదాల ప్రాంతంలో ఏనుగుల మంద సంచరిస్తోంది.
దీంతో అప్రమత్తమైన టీటీడీ పారెస్ట్ విభాగం, విజిలెన్స్ అధికారులు ఏనుగుల జాడ కోసం తనిఖీలు నిర్వహించారు.
ఈ అటవీ ప్రాంతంలో దాదాపు పదికి పైగా ఏనుగులు సంచరిస్తున్నాయని నిర్ధారణకు వచ్చారు.
ఏనుగు సంచారం నేపథ్యంలో శ్రీవారి పాదాల మార్గంలో నడకదారి భక్తుల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
సాధారణంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శ్రీవారి పాదాల మార్గంలో భక్తులను అనుమతిస్తారు.
కానీ ఇప్పుడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే భక్తులను అనుతిస్తున్నారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో భద్రాతా సిబ్బంది ప్రత్యేక నిఘా పెట్టారు.
గత రెండు రోజులుగా ఏనుగుల సంచారం లేకపోవడంతో అవి కాకులమానుకొండ అటవీప్రాంతంవైపు వెళ్లి ఉంటాయని నిర్ధారణకు వచ్చిన అటవీ అధికారులు శనివారం నుంచి ఆంక్షలను ఎత్తివేశారు.
అయితే తిరిగి ఉదయం శ్రీవారి పాదాల ప్రాంతంలోని అక్కగార్ల గుడి వద్దకు ఏనుగుల మంద వచ్చి హల్చల్ చేయడంతో పాటు అక్కడ ఉన్న కొన్ని చెట్లను కూడా తొక్కేశాయి. స్థానికుల ద్వారా తిరిగి ఏనుగుల సంచారం ఉందని సమాచారం అందుకున్న టీటీడీ ఫారెస్ట్, విజిలెన్స్ సిబ్బంది
ఏనుగుల జాడ కోసం గాలించారు. ఏనుగుల పాదాల ముద్రలు, ఇతర ఆనవాలు కనబడటంతో అధికారులు శ్రీవారి మెట్టుమార్గంలో మరోసారి ఆంక్షలు పెట్టారు.