యాహూ మెసెంజర్‌ను వాడుతున్న వినియోగదారులకు చేదు వార్త. జూలై 17వ తేదీ నుంచి యాహూ మెసెంజర్ సేవలను నిలిపివేస్తున్నట్లు దాని మాతృ సంస్థ ఓత్ ఐఎన్‌సీ వెల్లడించింది.
ఇకపై యాహూ మెసెంజర్ పనిచేయదని ఓత్ తెలిపింది.
అయితే యూజర్లకు చెందిన యాహూ ఐడీలు మాత్రం అలాగే ఉంటాయి.
కానీ వారు మెసెంజర్‌ను వాడుకోలేరు. కాకపోతే యాహూలో మెయిల్, ఇతర సేవలను వాడుకునేందుకు ఆ ఐడీ పనికొస్తుంది.
ఇప్పుడంటే వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ వంటి అనేక ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్స్‌ను యూజర్లు వాడుతున్నారు.
కానీ ఒకప్పుడు నెటిజన్లు యాహూ మెసెంజర్ ఒక్కటే దిక్కుగా ఉండేది.
అందులో యూజర్ల టేస్టులకు తగినట్లుగా చాటింగ్ రూమ్స్ కూడా ఉండేవి.
వాయిస్ చాట్, వీడియో చాట్ కూడా అందుబాటులో ఉండేది.
అయితే కాలక్రమేణా స్మార్ట్ఫోన్ల వాడకం ఎక్కువవడం, వాటిల్లో ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్స్ అందుబాటులోకి రావడంతో కేవలం పీసీలోనే పనిచేసే యాహూ మెసెంజర్ పట్ల యూజర్లు నిరాసక్తతను కనబరిచారు.
ఈ క్రమంలో యాహూ మెసెంజర్ ఏ దశలోనూ ఇతర ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌లకు పోటీనివ్వలేకపోయింది.
దీంతో ఆ మెసెంజర్ సేవలకు ముగింపు పలకక తప్పలేదు.
వెరిజాన్ కంపెనీ యాహూను టేకోవర్ చేశాక ఓత్ ఐఎన్సీని ఏర్పాటు చేసి దాని కిందకు ఏవోఎల్, యాహూ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
అయితే ప్రస్తుతం ఈ ఓత్ కంపెనీ యాహూ మెసెంజర్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ క్రమంలో జూలై 17వ తేదీ నుంచి యాహూ మెసెంజర్ ఇక పనిచేయదు.
అయితే యూజర్లు తమ చాట్ హిస్టరీని డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.
https://messenger.yahoo.com/getmydata లింక్‌ను సందర్శిస్తే యూజర్లు తమ యాహూ మెసెంజర్ చాట్ హిస్టరీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇందుకు ఆరు నెలల గడువు కూడా విధించారు. దీంతో ఇక యాహూ మెసెంజర్ 20 ఏళ్ల ప్రస్థానానికి తెర పడినట్లేనని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు.
యాహూ మెసెంజర్‌ను ఓత్ ఐఎన్‌సీ నిలిపివేసినా స్క్విరల్ (Squirrel) పేరిట ఓ కొత్త ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌ను మాత్రం త్వరలో అందుబాటులోకి తేనున్నారు.
ప్రస్తుతం ఈ యాప్ టెస్టింగ్ దశలో ఉంది. కేవలం ఇన్విటేషన్ ప్రాతిపదికన మాత్రమే ఈ యాప్‌లోకి కొత్త యూజర్లను అనుమతిస్తున్నారు.
టెస్టింగ్ పూర్తయితే స్క్విరల్ యాప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మరెంతో కాలం పట్టదని తెలిసింది.
ఇక ఈ కొత్త ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌ను ఓత్ ఐఎన్‌సీ ఎప్పుడు విడుదల చేస్తుందో వేచి చూడాలి.
అయితే యాహూ మెసెంజర్‌ను నిలిపివేయడం ఏమోగానీ చాలా మంది నెటిజన్లు తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు.
ఎన్నో సంవత్సరాల పాటు సేవలందించిన తమ ఫేవరెట్ మెసేజింగ్ యాప్ ఇక కనుమరుగు కానుందని తెలిసి బాధపడుతున్నారు.