దేశంలో ఏడెనిమిది నెలల పాటు పలు రైళ్ల రాకపోకల్లో ఆలస్యం అవుతుందని సాక్షాత్తూ రైల్వే బోర్డు వెల్లడించింది. రైల్వేశాఖ పలు రైలు మార్గాల్లో ట్రాక్ పునరుద్ధరణ, మరమ్మతు పనులు, అన్మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ల ఎత్తివేతకు అండర్ పాస్ బ్రిడ్జీల నిర్మాణ పనులు చేపట్టిన నేపథ్యంలో పలు రైళ్ల వేగాన్ని తగ్గించాలని రైల్వేబోర్డు తాజాగా నిర్ణయించింది. 2017,2018 సంవత్సరాల్లో 5వేల కిలోమీటర్ల మేర రైల్వేట్రాక్ మరమ్మతులు, అండర్ పాస్ వంతెనల నిర్మాణ పనులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రైల్వేబోర్డు (ట్రాఫిక్) సభ్యుడు జంషడ్ వెల్లడించారు. రైల్వేట్రాక్ మరమ్మతు పనుల వల్ల రైళ్ల రాకపోకల్లో సమయపాలన పాటించలేమని రైల్వే అధికారులు ప్రకటించారు. రాజకీయ ఒత్తిళ్లతో దశాబ్దాలుగా కొత్త రైళ్లను ప్రవేశపెడుతూ పోతున్నారే తప్ప రైల్వే ట్రాక్ మరమ్మతుల గురించి పట్టించుకోలేదు. దీంతో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో రైల్వేశాఖ రైల్వే లైన్ల మరమ్మతు పనులను చేపట్టింది. ప్రయాణికులు రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని అర్థం చేసుకొని సహకరించాలని రైల్వే శాఖ కోరింది.