బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, ఆర్జేడీ నేత చంద్రికా రాయ్ కుమార్తె ఐశ్వర్య రాయ్‌ల వివాహం శనివారం ఘనంగా జరిగింది.
అతిథులు, కుటుంబ సభ్యులు వేడుక సంబరాల్లో ఉండగా అక్కడకు అతిథులు రూపంలో వచ్చిన కొందరు దొంగలు తమ చేతివాటం చూపించారు.
వివాహ విందులో ముఖ్య అతిథుల కోసం తయారు చేసిన రుచికరమైన ఆహార పదార్థాలను దొంగిలించారు.
అనంతరం వంటశాలకు వెళ్లి అక్కడ ఖరీదైన వంటసామగ్రిని దోచుకెళ్లారు.
వీరిని గమనించిన ఆర్జేడీ నాయకులు వారిని పట్టుకోవాలని ప్రయత్నించారు.
అయితే అంతకు ముందు వారిని అడ్డుకున్న మీడియా ప్రతినిధులపైనా దొంగలు దాడి చేశారు. వారి కవరేజ్ పరికరాలను ధ్వంసం చేశారు.
వివాహ వేడుకకు సుమారు 7,000మందికి పైగా హాజరయ్యారు. వారందికీ భోజన ఏర్పాటు చేశారు.
వేడుక ప్రాంగణం రద్దీగా మారడంతో నిఘా కొరవడింది. దీంతో కొందరు దొంగలు అందిన కాడికి దోచుకెళ్లారు.
ఈ ఘటనపై మీడియా ప్రతినిధులు, క్యాటరింగ్ సిబ్బంది.. వేడుక నిర్వాహకులకు ఫిర్యాదు చేశారు.
తేజ్ ప్రతాప్ యాదవ్, ఐశ్వర్య రాయ్‌ల వివాహం పట్నాలోని స్ప్రావ్లింగ్ కళాశాల మైదానంలో శనివారం ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు రాజకీయ ప్రముఖులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
రాజకీయ విభేదాలను పక్కన పెట్టి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దంపతులు, ఇతర భాజపా నేతలు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు