Many pilgrims Kedarnath and Badrinath Yatra were trapped in the middle of the road as the snow falls in Uttarakhand,Vizagvision…ఉత్తరాఖండ్‌లో విపరీతంగా మంచు కురుస్తుండడంతో కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రలకు వెళ్లిన ఎంతో మంది యాత్రికులు మార్గ మధ్యలో చిక్కుకుపోయారు.
ఈ ప్రయాణికుల్లో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్, రాజ్యసభ సభ్యుడు ప్రదీప్ తామ్టా కూడా ఉన్నారు.
కేదార్నాథ్, బద్రీనాథ్ పుణ్య క్షేత్రాల వద్ద పెద్ద ఎత్తున మంచు కురుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
కేదార్నాథ్ క్షేత్రంలో ఓ మహిళ గుండెపోటుతో చనిపోయినట్లు తెలిపారు.
యాత్రలో చిక్కుకున్న ప్రయాణికులకు సహాయం చేయడానికి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ జవాన్లు, స్థానిక పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నిస్తున్నారు.
కేదార్నాథ్ బేస్ స్టేషన్ అయిన గౌరీకుంద్ ద్వారా అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
వాతావరణం అనుకూలించే వరకు యాత్రికులంతా మార్గంలో ఉన్న పలు విడిది ప్రదేశాల్లో ఉంటారని అధికారులు వెల్లడించారు.
కేదార్‌నాథ్‌లో అయిదు అంగుళాల మేర మంచు పేరుకుపోయింది.
హెలికాప్టర్ సేవలకు కూడా అంతరాయం కలుగుతోంది.
ఉత్తరాఖండ్‌లోనూ భారీ వర్షాలు, తుపాను సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
మాజీ సీఎం రావత్, ఆల్మోర్ ఎంపీ తామ్టా, స్థానిక ఎమ్మెల్యే మనోజ్ రావత్, మాజీ ఎమ్మెల్సీ పృథ్వి పాల్ సింగ్‌తో పాటు దాదాపు డజను మంది కాంగ్రెస్ నేతలు కేదార్నాథ్ యాత్రకు వెళ్లారు.
రాష్ట్రంలోని రుద్రప్రయాగ జిల్లాలోని గౌరీకుంద్ నుంచి ఆదివారం యాత్రకు బయలుదేరారు.
విపరీతంగా మంచు కురుస్తుండడంతో వీరు కూడా యాత్రలో చిక్కుకుపోయారు.
కేదార్ నాథ్ యాత్రకు ప్రచారం కల్పిస్తున్న ప్రభుత్వం కనీస వసతులు పట్టించుకోవడం లేదని, నడిచి వెళ్లేవారికి సదుపాయాలు సరిగ్గా లేవని ఎంపీ తామ్టా ఫోన్ ద్వారా మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శించారు.
మంచు కురుస్తున్న నేపథ్యంలో చమోలి జిల్లా అధికారులు బద్రీనాథ్ వెళ్లే యాత్రికులను కూడా ఆపుతున్నారు.
యాత్రికులను విడిది స్టేషన్లలో ఉండాల్సిందిగా కోరారు.
డెహ్రాడూన్‌లోనూ గత రాత్రి భారీ వర్షం కురిసింది. పలు వృక్షాలు కూలిపోయాయి. ముందు జాగ్రత్తగా పాఠశాలలు మూసేశారు.