AP CM Chandra babu Dharma Porata Deeksha at Vijayawada,Vizagvision..ఏపీ సీఎం చంద్రబాబు.. ఇవాళ ధర్మపోరాట దీక్షకు కూర్చోబోతున్నారు. తన పుట్టినరోజున.. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు డిమాండ్‌తో.. దాదాపు పన్నెండు గంటల పాటు.. ఆయన దీక్ష చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏపీ శాఖ.. విజయవాడ మునిసిపల్ గ్రౌండ్స్‌లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
ప్రత్యేక హోదా అంశంపై పోరులో భాగంగా.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. శుక్రవారం విజయవాడ మున్సిపల్ స్టేడియంలో దీక్షలో కూర్చోనున్నారు. ధర్మపోరాట దీక్ష కోసం.. విజయవాడ మున్సిపల్ గ్రౌండ్స్‌లో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. వేదిక ప్రాంగణం మొత్తం టెంట్లు వేశారు. స్టేడియంలో రెండు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు.
ఒక వేదికపై చంద్రబాబు దీక్ష , మరో వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, సుమారు 200 మంది ఆసీనులైయ్యేలా దీక్షా వేదిక ముస్తాబైంది. వేదిక ముందు 10వేల మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. పుట్టినరోజు సందర్భంగా.. ఎలాంటి వేడుకలూ జరుపుకోకుండా.. హోదా, రైల్వేజోన్, పోలవరం తదితర విభజన హామీల అమలు కోసం తమ నేత పన్నెండు గంటల పాటు దీక్షలో కూర్చుకుంటున్నారని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. ధర్మ పోరాట దీక్ష ద్వారా రాష్ట్రానికి మోదీ చేసిన అన్యాయాన్ని ఎండగట్టాలని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు.
విజయవాడలో ముఖ్యమంత్రి చేపట్టిన దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల స్థాయిలో పార్టీ శ్రేణులు దీక్షలు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి దీక్షకు సంఘీభావంగా వచ్చే వారిని.. ఉదయం ఏడు నుంచి పదకొండు, పదకొండు నుంచి మూడు, మూడు నుంచి ఏడు గంటల వరకూ మూడు విభాగాల్లో దీక్షకు అనుమతిస్తారు. దీక్షాస్థలి వద్ద.. అత్యవసర సేవల కోసం వైద్య సిబ్బందిని, అంబులెన్సులను అందుబాటులో ఉంచుతున్నారు. దీక్షను అందరూ వీక్షించే విధంగా భారీ ఎల్ఈడీ స్క్రీన్లను సిద్ధం చేశారు. కార్యక్రమానికి వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతోన్న ధర్మపోరాట దీక్షకు.. టీడీపీ శ్రేణులు వివిధ వర్గాల మద్దతును కూడగడుతున్నారు. ఉద్యోగులు కూడా ముఖ్యమంత్రి దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు.