Vizag Vision:Launch of ISRO’s – GSLV-F08 / GSAT-6A Satellite from SHAR, Sriharikota.,.కమ్యూనికేషన్ల రంగంలో భారత్ కొత్త పుంతలు తొక్కనుంది.
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌థావన్ అంతరిక్ష కేంద్రం నుంచి అధునాతన ఉపగ్రహం జీశాట్-6ఏ నింగిలోకి దూసుకెళ్లింది.
జీఎస్ఎల్వీ -ఎఫ్08 వాహక నౌకద్వారా జీశాట్-6ఏను శాస్త్రవేత్తలు నింగిలోకి పంపారు.
ఇందులోని విచ్చుకునే సామర్థ్యమున్న 6 మీటర్ల ఎస్-బ్యాండ్ యాంటెన్నా, చేతిలో ఇమిడిపోయే భూతల టెర్మినళ్లు, నెట్వర్క్ నిర్వహణ విధానాలు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సాంకేతిక సత్తాకు నిదర్శనం.
ఇవన్నీ ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ అవసరాలకు ఉపయోగపడతాయి.
జీఎస్ఎల్వీ ఎఫ్08 తొలి దశ విజయవంతమైందనిశాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఈ ఉపగ్రహం.. ‘మల్టీ బీమ్ కవరేజీ’ సౌకర్యం ద్వారా దేశవ్యాప్తంగా మొబైల్ కమ్యూనికేషన్‌ను అందిస్తుంది.
ఇది ఐదు స్పాట్ బీమ్స్‌లలో ఎస్-బ్యాండ్‌ను, ఒక బీమ్‌లో సి-బ్యాండ్‌ను కలిగి ఉంటుంది.
ఉపగ్రహంలో కమ్యూనికేషన్ల సంధానత కోసం 6 మీటర్ల వ్యాసం కలిగిన ‘విచ్చుకునే యాంటెన్నా’, హబ్ కమ్యూనికేషన్ లింక్ కోసం 0.8 మీటర్ల స్థిర యాంటెన్నా ఉంటాయి.
ఈ ఉపగ్రహంలో విచ్చుకునే యాంటెన్నాను ఏర్పాటు చేశారు.
దీని వెడల్పు 6 మీటర్లు. జీశాట్-6ఏ.. కక్ష్యలోకి చేరాక ఇది గొడుగులా విచ్చుకుంటుంది.
ఈ ఉపగ్రహం కోసమే దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు.
సాధారణంగా ఇస్రో ఉపయోగించే యాంటెన్నాల కన్నా ఇది మూడు రెట్లు పెద్దది.
చేతిలో ఇమిడిపోయే భూతల టెర్మినళ్ల ద్వారా ఎక్కడి నుంచైనా మొబైల్ కమ్యూనికేషన్లు సాగించడానికి ఇది వీలు కల్పిస్తుంది.
సైనిక అవసరాలకూ ఉపయోగపడుతుందని సమాచారం.
ఎస్-బ్యాండ్ అనేది విద్యుదయస్కాంత స్పెక్ట్రమ్‌లో ఒక భాగం.
2 నుంచి 4 గిగాహెర్జ్ (జీహెచ్‌జెడ్) పౌనఃపున్యాల నడుమ అది ఉంటుంది.
ఈ బ్యాండ్‌ను వాతావరణాలకు సంబంధించిన అన్ని రాడార్లు, నౌకలు, కొన్ని కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో వాడుతున్నారు.
2.5 జీహెచ్‌జెడ్ బ్యాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా 4జీ సేవలకు వాడుతున్నారు.
అందువల్ల ఎస్-బ్యాండ్ చాలా ప్రయోజనకరమైంది. ఇది వందలకోట్ల డాలర్ల విలువ చేస్తుంది. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు ఇది కీలకం.
జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని మోసుకెళుతున్న జీఎస్ఎల్వీ-ఎఫ్08.. జీఎస్ఎల్వీ మార్క్-2 శ్రేణికి చెందినది.
భారత్ అభివృద్ధి చేసిన రాకెట్లలో రెండో అతిపెద్దది.
ఆ శ్రేణి రాకెట్‌ను ప్రయోగించడం ఇది 12వ సారి.
ఈ వాహకనౌకలో దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్ ఉంటుంది.
స్వదేశీ క్రయో ఇంజిన్‌తో ప్రయోగాన్ని చేపట్టడం ఇది ఆరోసారి.
2014 జనవరి తర్వాత వరుసగా నాలుగు సార్లు ఈ రాకెట్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి.
జీఎస్ఎల్వీ-ఎఫ్08లో మూడు దశలు ఉంటాయి.
మొదటి దశ ఇంజిన్‌లో ద్రవ ఇంధనంతో నడిచే నాలుగు స్ట్రాపాన్ ఇంజిన్లు, మిశ్రమ ఘన ఇంధనంతో నడిచే ప్రధాన ఇంజిన్ ఉంటాయి.
రెండో దశలో ద్రవ ఇంధనాన్ని వాడతారు. మూడో దశలో అత్యంత శీతల క్రయోజెనిక్ ఇంధనాలను ఉపయోగిస్తారు.