తిరుపతి పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 515వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద మంగళవారం ఉదయం టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవం వైభవంగా జరిగింది.
టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, భజన మండళ్ల కళాకారులు ఉదయం 6 గంటల నుంచి అన్నమాచార్యులవారి ”సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం” నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా మెట్లపూజ జరిగింది. అన్నమయ్య వంశీకులు చెన్నైకి చెందిన సర్వశ్రీ టి.వి.మీనాలోచన, తాళ్లపాకకు చెందిన శ్రీ హరినారాయణ ఆలపించిన ”బ్రహ్మకడిగిన పాదము…., భావములోన …, అదివో అల్లదివో…” తదితర కీర్తనలు ఆకట్టుకున్నాయి. మెట్లోత్సవం సందర్భంగా నిర్వహించిన కోలాటాలు , భజనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆ తరువాత కళాకారులు సంకీర్తనలు గానం చేస్తూ కాలినడకన తిరుమలకు వెళ్లారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి భజన మండళ్ల కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.