ఆధార్‌తో మొబైల్ నంబర్, బ్యాంక్ అకౌంట్ల అనుసంధానం డెడ్‌లైన్‌ను నిరవధికంగా పొడిగించింది సుప్రీంకోర్టు.
దీనిపై ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పును వెలువరించే వరకు డెడ్‌లైన్ అంటూ ఏమీ ఉండదని స్పష్టంచేసింది.
గతంలో చెప్పిన తీర్పు ప్రకారం మార్చి 31తో ఈ డెడ్‌లైన్ ముగుస్తున్నది.
అయితే ఆధార్ రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ ఆలోపు పూర్తి కాదని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తేల్చి చెప్పింది.
దీంతో డెడ్‌లైన్‌ను నిరవధికంగా పొడిగించింది. చివరి నిమిషంలో డెడ్‌లైన్‌ను పొడిగిస్తే బ్యాంకులు, స్టాక్ ఎక్స్చేంజ్లాంటి ఆర్థిక సంస్థలకు సమస్యలు వస్తాయని గతంలోనే ఈ ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టంచేసింది.
ఆధార్‌తో సంక్షేమ పథకాలు, బ్యాంక్ అకౌంట్లు, మొబైల్ నంబర్, పాన్ నంబర్ల అనుసంధానాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.
భవిష్యత్తులో ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్లతోనూ ఆధార్‌ను అనుసంధానించే ఆలోచన చేస్తున్నది ప్రభుత్వం.
గతేడాది డిసెంబర్ 15న సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌ను మార్చి 31 వరకు పొడిగించింది.
అయితే అసలు ఆధార్ రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
వాటిని పరిష్కరించకుండా ఈ అనుసంధానం సాధ్యం కాదని సుప్రీం భావించింది.