Vizag Vision:69th Republic Day Celebrations Governor,,Vijayawada.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ప్రజా శ్రయేస్సు కరోసం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు వెళుతుందని, రాబోయే రోజుల్లోనూ ఇదే ఒరవడి కొనసాగిస్తుందని, రాష్ట్ర విభజన కష్టాలను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని.. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ అన్నారు. శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో నిర్వహించిన 69వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ నరసింహన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దావోస్ పర్యటన ముగించుకుని తిరుగుప్రయాణం అయినప్పటికీ విమానం ఆలస్యం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గణతంత్ర వేడుకలకు హాజరుకాలేకపోయారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తోందని, ప్రజల్లో 80శాతం సంతృప్తి స్థాయికి చేరుకునేలా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. చంద్రన్న మాల్స్ ద్వారా నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకే అందిస్తోందని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమం ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తోంది. 10,720 కిలోమీటర్ల పొడవైన రహదారులను రూ.7,621 కోట్లతో అభివృద్ధి చేస్తోంది. బీసీల్లో ఎఫ్ కేటగిరీ కింద కాపులకు రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రయత్నం చేస్తోంది. ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిచేందుకు అసెంబ్లీ బిల్లు పాస్ చేశాం. గోదావరి-కృష్ణా నదులను పట్టిసీమ ద్వారా అనుసంధానం చేసి ఫలాలు సాధించగలిగాం. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం రూ.423కోట్లు ఖర్చు చేస్తోంది. సాంకేతికతను జోడించి ఉత్పాదకతను పెంచుతోంది. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను రూ.3,806కోట్లతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసి 2019 నాటికి గ్రావిటీ ద్వారా నీరందిస్తాం అని గవర్నర్ నరసింహన్ వివరించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కవాతు చేసిన కంటిన్జెంట్లలో మొదటి బహుమతి ఇండియన్ ఆర్మీ సైనికులకు దక్కగా, రెండో బహుమతి 16వ బెటాలియన్‌కు దక్కాయి. నాన్ క్యాడర్లో మొదటి బహుమతిని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీకి, రెండో బహుమతి ఎన్సీసీ బెటాలియన్ (బాలికలు)కి వచ్చాయి. అలాగే శకటాల ప్రదర్శనలో మొదటి బహుమతి విద్యా శాఖకు చెందిన సర్వశిక్షా అభియాన్, రెండో అవార్డు గృహ నిర్మాణ శాఖకు, మూడో అవార్డు అటవీ శాఖకు దక్కాయి. గణతంత్ర వేడుకల్లో శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, శాసనమండలి ఛైర్మన్ ఎన్.ఎం.డి.ఫరూక్, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, కిమిడి కళా వెంకట్రావు, శిద్దా రాఘవరావు, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని), రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్, రాష్ట్ర డీజీపీ పి.మాలకొండయ్య, నగర మేయర్ కోనేరు శ్రీధర్, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గద్దె అనూరాధ, శాసనమండలి విప్ బుద్దా వెంకన్న, జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, నగర పోలీస్ కమిషనర్ డి.గౌతం సవాంగ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మనవడు దేవాన్ష్, పలువురు ఉన్నతాధికారులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు