VIZAG VISION:Biggest corruption in ACB History,Bribing 27 lakh rupees,Vijayawada…ఏసీబీ అధికారులు ఓ భారీ తిమింగళాన్ని వలవేసి పట్టుకున్నారు. తమ చరిత్రలోనే అతిపెద్ద లంచగొండి కేసును నమోదు చేశారు. రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖలో ఓ అవినీతి అనకొండ బాగోతాన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 23 లక్షల రూపాయల సొమ్మును అవినీతి మొత్తం తీసుకున్న అడిషినల్ కమిషనర్ ఉప్పు ఏడుకొండలుతో పాటు అతని సహకరించిన సూపరింటెండెంట్, ఆ నగదును అందజేస్తున్న ఓ ప్రయివేటు కంపెనీకి చెందిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవినీతి నిరోధకశాఖ చరిత్రలోనే ఇప్పటివరకూ ఇదే అతిపెద్ద కేసుగా ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్.పి.ఠాకూర్ మీడియా సమావేశం పెట్టి ప్రకటించారు.
విజయవాడ నగర శివారులోని రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ విభాగం సిబ్బంది శుక్రవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గురువారం సాయంత్రం వచ్చిన ఓ పక్కా సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్.పి.ఠాకూర్ నేతృత్వంలోని బృందం ఆ కార్యాలయంపై నిఘా ఉంచింది.
ప్రధాన కార్యాలయంలో వాణిజ్య పన్నులశాఖ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అడిషినల్ కమిషనర్ ఏడుకొండలు ఛాంబరులో 25 లక్షల రూపాయలు చేతులు మారుతున్నట్లు ఏసీబీకి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతో ఆకస్మిక తనిఖీ జరిపారు. అడిషినల్ కమిషనర్ ఉప్పు ఏడుకొండలుతోపాటు ఆ సమయంలో అక్కడ కార్యాలయం సూపరింటెండెంట్ అనంతరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మలేషియాకు చెందిన ఐటీడీ సిమెంటేషన్ ఇండియా లిమిటెడ్ కంపెనీ గతంలో ఏపీలోని రెండు పోర్టుల్లో బెర్తు నిర్మాణాలు చేసింది.
వీటికి సంబంధించి నాలుగు కోట్ల 60 లక్షల రూపాయల ఇన్పుట్ ట్యాక్స్ రిఫండ్ కంపెనీకి రావాలి. ఈ పన్ను మొత్తం వెనక్కి ఇచ్చేందుకు కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు లంచం డిమాండ్ చేశారు. పెద్ద మొత్తం కావడంతో లంచం కూడా భారీగానే ఉంది. పాతిక లక్షలకు డీల్ కుదిరింది. సదరు కంపెనీకి చెందిన డిప్యూటీ మేనేజర్ సత్యనారాయణ, కంపెనీ న్యాయ సలహాదారు గోపాలశర్మ డబ్బు తీసుకుని నేరుగా ఏడుకొండలు ఛాంబర్ కు వచ్చారు. అప్పటికే అక్కడ నిఘా వేసి ఉంచిన ఏసీబీ వారిని అదుపులోకి తీసుకుంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. లంచం తీసుకున్న ఏడుకొండలుతో పాటు ఇచ్చిన కంపెనీ ప్రతినిధులు సత్యనారాయణ, గోపాలశర్మపై కూడా కేసు పెట్టారు.