VIZAGVISION:Ap Cm Chandrababu vist to UAE Day-6,Abu Dhabi…అబుదాబీలో చరిత్రాత్మక మసీదును సందర్శించిన సీఎం చంద్రబాబు..నవ్యాంధ్ర అభివృద్ధికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు విదేశీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం అబుదాబీలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి చరిత్రాత్మకమైన షేక్ జాయేద్ గ్రాండ్ మసీదును ముఖ్యమంత్రి చంద్రబాబు తన బృందంతో కలిసి సందర్శించారు. సోమవారం ఉదయం అబుదాబీ ఇన్వెస్టుమెంట్ అథారిటీ (ఏడీఐఏ) సమావేశానికి హాజరయ్యే క్రమంలో తొలుత సీఎం చంద్రబాబు షేక్ జాయేద్ గ్రాండ్ మసీదును సందర్శించారు. షేక్ జాయేద్ గ్రాండ్ మసీదును సందర్శించినవారిలో సీఎం చంద్రబాబుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, కొల్లు రవీంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి జి.సాయిప్రసాద్, ఇంధన వనరులు, మౌలిక సదుపాయాల విభాగం ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, సాల్మన్ అరోకియా రాజ్, ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు సిఇఓ జాస్తి కృష్ణకిశోర్, వేమూరి ప్రసాద్ ఉన్నారు. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ అల్లుడు షేక్ హమీద్ బిన్ తహ్నౌన్ అల్ నహ్యాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. యూఏఈలో అత్యంత ప్రముఖ వ్యక్తులలో ఒకరైన తహ్నౌన్ అక్కడి అల్ ఐన్ పాలకుని కుమారుడు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉందని, అక్కడ సానుకూలతలు, సామర్ధ్యాలు, ప్రత్యేకతలను, పుష్కలమైన సహజవనరులపై సీఎం చంద్రబాబు తహ్నౌన్కు వివరించారు.