VIZAGVISION:Chief Minister of AP Vist to UAE Day-5,Dubai..ఆంధ్రావనిలో ఆనందలహరి
సంతృప్తి స్థాయి పెంచుతూ ఆనందమయ పరిపాలన
యుఎఇ ‘హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్’ లేడీ మినిస్టర్‌తో చంద్రబాబుభేటీ
పాలనపై సంతోష స్థాయి సాధనకు ఎమిరేట్స్‌లో పుస్తకం
సానుకూల దృక్పథం ద్వారా ప్రజల్లో ఆనందం
ఆంధ్రప్రదేశ్‌లో తాము ప్రజల సంతోష స్థాయినే కొలమానంగా తీసుకుని, ఆనందమయ సమాజం ఏర్పాటు కోసం పనిచేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా ‘చంద్రబాబు నాయుడు తెలిపారు. దుబాయిలో యుఎఇ (UAE) హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్ శాఖా మంత్రి ఉద్ బిన్ ఖల్ఫాన్ అల్ రౌమి (Ohood bint khalfan Al Roumi) తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం సమావేశమయ్యారు. తమ రాష్ట్రంలో ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఆనందపు వారాంతాలు, ఆనంద లహరి, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక తదితర కార్యక్రమాలన్నీ అందులో భాగమేనని వివరించారు. ఇ-కార్యాలయాల ప్రవేశంతో ఉద్యోగుల పనిభారం గణనీయంగా తగ్గిపోయిందని చెప్పారు. ఉద్యోగులు ఆనందంగా, ఆహ్లాద వాతావరణంలో పనిచేయడానికి వీలుగా అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయమంతా ఏసీ సదుపాయం కల్పించామన్నారు. తమ కార్యాలయాలను క్రమంగా పనివత్తిడి లేని, సౌకర్యవంతమైన కార్యస్థానాలుగా మార్చుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. తాము ఒక పద్ధతి ప్రకారం సంతోష సూచిక స్థాయిని పెంచుకుంటున్నామని, యుఎఇ (UAE) లో అమలుచేస్తున్న మేలిమి విధానాలను తప్పకుండా అనుసరించి మరిన్ని మెరుగైన ఫలితాలను సాధించాలన్నది తమ ఉద్దేశమని ముఖ్యమంత్రి చంద్రబాబు ‘హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్’ శాఖా మంత్రి ఉద్ బిన్ ఖల్ఫాన్ అల్ రౌమి (Ohood bint khalfan Al Roumi) కు వివరించారు. సమావేశానంతరం హ్యాపీనెస్ లేడీ మినిస్టర్‌తో కలిసి అక్కడి హ్యాపీనెస్ డిపార్టుమెంటులోని ఒక చిన్న కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. ఆ కేంద్రం ఎలా పనిచేస్తోందీ ఎమిరేట్స్ హ్యాపీనెస్ మినిస్టర్ చంద్రబాబుకు వివరించారు. ప్రభుత్వ శాఖలను ఎలా పర్యవేక్షిస్తున్నదీ, సంతోషస్థాయిని ప్రజల నుంచి ఎలా తెలుసుకుంటున్నదీ ఆమె తెలిపారు
ఇదిలా ఉంటే ప్రజల్లో సంతృప్తే పరిపాలనకు గీటురాయిగా భావిస్తూ యూఏఇ ప్రభుత్వం నెలకొల్పిన హ్యీపీనెస్ మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలను అమలుచేస్తోంది. సానుకూల దృక్ఫధాన్ని అలవరచి తద్వారా సంతోషాన్ని పెంపొందించేలా అక్కడి ప్రభుత్వ శాఖలు ఒక మాన్యువల్‌ను తు.చ. తప్పకుండా అనుసరిస్తాయి. విద్యాసంస్థలు, కార్యాలయాలలో ఈ శాఖ కార్యకలాపాలు వుంటాయి.సంతోషం, సానుకూల దృక్ఫథం ధ్యేయంగా అక్కడి అధికారులకు అవసరమైన శిక్షణ అందిస్తారు.
ప్రభుత్వం తీసుకునే ప్రతి విధాన నిర్ణయం సంతోష సూచిక కొలమానంగా తీసుకుని చేయడం విశేషం. ప్రజల సంతోషంపై ఆ విధానాలు ఎటువంటి ప్రభావాలు చూపుతాయనేది ముందుగానే పరిశీలించి ఆ మేరకు విధాన నిర్ణయాలు ప్రకటిస్తారు. వినియోగదారులు, ప్రజల సంతృప్తి చెందడానికే పరిమితం కాకుండా ఇప్పుడు వారు ప్రజల సంతోషమే పరమార్ధంగా పనిచేస్తున్నారు. 2018 ఫిబ్రవరి 10న అక్కడి ప్రభుత్వం వరల్డ్ హ్యాపీనెస్ సదస్సును నిర్వహించనుంది.
సమావేశంలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డా పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శి జి. సాయిప్రసాద్, ఏపీ ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
బిన్ జాయేద్ గ్రూపుతో అవగాహన ఒప్పందం
బిన్ జాయేద్ గ్రూపుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టులకు నిధుల కోసం ముఖ్యమంత్రి సమక్షంలో ఏపీ ఈడీబీ, యుఏఈకి చెందిన బిన్ జాయేద్ ఇంటర్నేషనల్ సంస్థ అవగాహన ఒప్పంద పత్రాలను మార్చకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం మన రాష్ట్ట్రంలో 2 బిలియన్ల డాలర్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు సంబంధించి బిన్ జాయేద్ ఇంటర్నేషనల్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది. రహదారులు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి బిన్ జాయేద్ గ్రుపు పెట్టుబడులు పెడుతుంది.
అమరావతిలో తలపెట్టిన మేజర్ ఆర్టీరియల్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, విజయవాడ మెట్రో రైల్, రామాయపట్నం బహుళార్థక సాధక ఓడరేవు అభివృద్ధి, భోగాపురం నుంచి భీమునిపట్నం వరకు, విశాఖ నుంచి అడ్డారిపేట వరకు బీచ్ కారిడార్లు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు తదితర ప్రాజెక్టుల అభివృద్ధికి పెట్టుబడులు తెస్తుంది. ఆయా ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వానికి బిన్ జాయేద్ గ్రూపు నేరుగా నిధులు అందించనున్నది.
అవగాహన ఒప్పంద పత్రాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్, బిన్ జాయెద్ ఇంటర్నేషనల్ ఎల్ ఎల్ సి తరపున ఆ సంస్థ ఎండి. మిధాత్ కిద్వాయ్ (Midhat Kidwai) సంతకాలు చేశారు.