కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలను తలకెత్తుకోనున్న రాహుల్ గాంధీని కీలక రాజకీయ శక్తిగామలిచేందుకు, ప్రధాని మోడీ ని దీటుగా ఢీ కొట్టేందుకు అవసరమైన కసరత్తుకు ఏఐసీసీ శ్రీకారం చుట్టింది.
బ్రాండ్ రాహుల్‌ను ప్రమోట్ చేసేందుకు పలు వ్యూహాలకు పదును పెడుతోంది.
ముందుగా ట్విట్టర్లో మోడీ కన్నా బాగా వెనుకబడిన యువనేతను సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేయడంపై దృష్టిసారించింది.
ఇందులో భాగంగా రాహుల్ ట్విట్టర్ ఐడీని మార్చే పనిలో పడింది.
ప్రస్తుతం ఆఫీస్ఆఫ్ఆర్జీగా ఉన్న ఐడీని రాహుల్‌గాంధీగా మార్చనుంది.
ప్రధాని మోదీకి ట్విట్టర్లో ఇప్పటికే 3.5 కోట్ల మంది ఫాలోయర్లు ఉండగా, రాహుల్‌ను కేవలం 37 లక్షల మందే అనుసరిస్తున్నారు.
ట్విట్టర్లో రాహుల్ ఫాలోవర్ల సంఖ్యను పెంచడంతో పాటు సోషల్ మీడియాలో పార్టీ కార్యకలాపాలను వేగవంతం చేయడం, నెటిజన్లతో అనుసంధానం పెంచడంపై పార్టీ నేతలు దృష్టిసారించారు.
రాహుల్ సైతం ఇటీవల మో డీ సర్కార్‌పై పదేపదే పదునైన పంచ్‌లతో విరుచుకుపడుతున్నారు.
నోట్ల రద్దు, సర్జికల్ స్ర్టైక్స్, జీఎస్టీ వంటి అంశాలపై రాహుల్ నేరుగా మోదీపై విమర్శనాస్ర్తాలు ఎక్కుపెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.
మరోవైపు రాహుల్‌ను పార్టీ అధ్యక్ష పగ్గాలను చేపట్టాలని కోరుతూ ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్‌కు కీలక బాధ్యతలు అప్పగించే క్రమంలో రాహుల్ రీబ్రాండింగ్‌పై ఆ పార్టీ నేతలు కసరత్తు ముమ్మరం చేశారు.