VIZAGVISION:Srisailam Dam Gates Opened Attracts Visitors Beauty,Srisailam…సీజనులో తొలిసారిగా శ్రీశైలం జలాశయం ఆనకట్ట గేట్లను ఎత్తారు. కొద్దిసేపటి క్రితం ఏపీ మంత్రి దేవినేని ఉమ గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. 885 అడుగుల నీటి నిల్వ సామర్థ్యమున్న ప్రాజెక్టులో 884.60 అడుగులకు నీరు చేరుకోవడం, 215 టీఎంసీలకు గాను 213 టీఎంసీల నీరుండటంతో రెండు గేట్లను ఎత్తి 56 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలాలని అధికారులు అంతకుముందే నిర్ణయించారు. కేవలం విద్యుత్ ఉత్పత్తి ద్వారా మాత్రమే నీటిని వదులుతూ ఉండాలని తొలుత భావించినా, ఎగువ నుంచి వస్తున్న వరద కొనసాగుతూ ఉండటం, ప్రాజెక్టులో ఈ నెలాఖరువరకూ 883 అడుగుల నీటి మట్టాన్ని నిర్వహించాలని కేంద్ర జల సంఘం చేసిన సూచనలను దృష్టిలో పెట్టుకుని గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు.
ఒక్కో గేటును పది అడుగులు ఎత్తాలని నిర్ణయించామని అధికారులు తెలిపారు. దీనికి అదనంగా సాధ్యమైనంత మేరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ కూడా నీటిని వదులుతామని అధికారులు వెల్లడించారు. దీంతో నాగార్జున సాగర్ కు 1.50 లక్షల క్యూసెక్కుల వరకూ నీరు చేరనుంది.