ప్రభుత్వ సేవింగ్ పథకాలకు కూడా ఆధార్‌ను తప్పనిసరిచేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టాఫీస్ డిపాజిట్ ఖాతాలు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్), నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర డిపాజిట్లు తదితరాలను ప్రారంభించేందుకు ఆధార్ తప్పనిసరి అని పేర్కొంటూ ఆర్థిక మంత్రిత్వ శాఖ నాలుగు వేరు వేరు గెజిట్ నోటిఫికేషన్లను జారీ చేసింది. పోస్టాఫీసుల్లో ఇప్పటికే డిపాజిట్లు కలిగి ఉన్నవారు ఈ ఏడాది డిసెంబరు 31లోగా తమ ఆధార్ కార్డులను డిపాజిట్ సర్టిఫికెట్లకు అనుసంధానం చేసుకోవాలి. సెప్టెంబరు 29వ తేదీతో జారీ అయిన నోటిఫికెేషన్లలో పేర్కొన్నదాని ప్రకారం ఆధార్ నంబరను ఇంకా పొందని డిపాజిటర్లు, ఆధార్ నంబర్ ఎన్రోల్మెంట్ కోసం చేసుకున్న దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.
బినామీ లావాదేవీలు, ఒప్పందాలు, నల్లధనం లాంటి వాటిని అరికట్టేందుకు బ్యాంకు డిపాజిట్లకు కూడా ఆధార్‌ను సమర్పించాలని కోరింది. ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాల లబ్దిని, సబ్సిడీలను పొందేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేసింది. ఇంకా ఆధార్ నంబరు పొందకుండా, వివిధ పథకాలకు, డిపాజిట్లకు అనుసంధానం చేసుకోని వారి కోసం డిసెంబరు నెలాఖరు వరకు గడువు పొడిగిస్తున్నట్లు గత నెలలో తెలిపింది. ఆధార్ పొందని వారికి అంతకుముందు సెప్టెంబరు 30ని తుది గడువుగా నిర్ణయించింది.
పేద మహిళలకు ఉచిత వంట గ్యాస్, కిరోసిన్, ఎరువులపై సబ్సిడితో సహా ప్రజా పంపిణీ వ్యవస్థ(పిడిఎస్), గ్రామీణ ఉపాథి హామీ పథకంతో పాటు దాదాపు 135 పథకాలకు ఆధార్ కార్డును అనుసంధానం చేసుకునేందుకు ప్రభుత్వం సెప్టెంబరు 30 వరకు గడువు పొడిగించింది. మళ్ళీ ఇప్పుడు దానిని డిసెంబరు 31 వరకు పొడిగించింది. 1995 నాటి ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్, స్కాలర్షిప్స్, హౌసింగ్ సబ్సిడి బెనిఫిట్, ఎస్సీఎస్టీలకు కోచింగ్, గైడెన్స్ ఇచ్చేందుకు, వొకేషనల్ ట్రైనింగ్‌కు, హ్యాండీ కాప్డ్, ఆమ్ ఆద్మీ బీమా యోజన తదితర పథకాలకు ఆధార్‌ను అనుసంధానించే గడువును కూడా డిసెంబరు 31 వరకు పొడిగించింది.